వాహన ధరలు పెంచుతాం
న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌తో పాటు రెనో ఇండియా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని యోచిస్తోంది. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరుగుతుండడంతో ధరలను పెంచక తప్పదని వాహన కంపెనీలు భావిస్తున్నాయి. వాణిజ్య వాహనాల ధరలను 1% వరకూ పెంచాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. ఇప్పటికే ప్రయాణికుల వాహనాల ధరలను 1-2% పెంచనున్నట్లు ఈ కంపెనీ చెప్పడం తెలిసిందే. ఇక రెనో ఇండియా కూడా ధరలను పెంచనున్నది.
అయితే ఎంత వరకూ ధరలను పెంచాలనే విషయమై ఈ కంపెనీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. విదేశీ కరెన్సీలతో రూపాయి మారకం ఒడిదుడుకులు ఇంకా తగ్గలేదని, ఈ ఒత్తిడి ప్రభావం ఉంటుందని, కొంత భారానైనా వినియోగదారులకు బదిలీ చేయక తప్పదని రెనో ఇండియా కంట్రీ సీఈవో, ఎండీ సుమిత్ సాహ్న పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఫారెక్స్ ఒడిదుడుకులు 25 శాతంగా ఉన్నాయని, కానీ ఏ కంపెనీ కూడా 25 శాతం వరకూ ధరలను పెంచలేదని పేర్కొన్నారు. కాగా హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు ధరల పెంచనున్నాయని ఇప్పటికే ప్రకటించాయి.