న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ ప్రయాణికుల వాహన ధరలను పెంచుతోంది. వచ్చే నెల 1 నుంచి వాహన ధరలను రూ.60,000 వరకూ పెంచుతున్నామని టాటా మోటార్స్ తెలిపింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్ బిజినెస్) మయాంక్ పరీక్ చెప్పారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఇతర ఆర్థిక కారణాల వల్ల ధరలను పెంచుతున్నామని తెలిపారు.
రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి జోరును కొనసాగించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తామందిస్తున్న టియాగో, హెక్సా, టైగర్, నెక్సాన్ మోడళ్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుండడమే దీనికి కారణమని పేర్కొన్నారు. కాగా ఇటీవలనే జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ తన కార్ల ధరలను రూ.1–9 లక్షల రేంజ్‌లో పెంచిన విషయం తెలిసిందే. టాటా మోటార్స్ రూ.2.28 లక్షల ధర ఉన్న జెన్ ఎక్స్ నానో మోడల్ నుంచి రూ.17.42 లక్షల ధర ఉన్న ప్రీమియమ్ ఎస్‌యూవీ హెక్సా వరకూ విక్రయిస్తోంది.
నిస్సాన్ పెంపు 2 శాతం
కార్ల కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కార్ల ధరలను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ఈ కార్ల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీలంటున్నాయి. ఇప్పటికే ఆడీ, టాటా మోటార్స్, నిస్సాన్ కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు వెల్లడించాయి.
వచ్చే నెల 1 నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నామని నిస్సాన్ ఇండియా తెలిపింది. ఈ పెరుగుదల 2 శాతం వరకూ ఉంటుందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎమ్‌డీ, జెరోమి సైగట్ చెప్పారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల కారణంగానే ధరలను పెంచుతున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment