మరిన్ని కంపెనీల కార్ల ధరలు పెంపు
* జాబితాలో టాటా మోటార్స్, నిస్సాన్, రెనో, స్కోడా
* మోడళ్లను బట్టి 3 శాతం వరకూ వడ్డింపు
న్యూఢిల్లీ: కార్ల ధరలను తాజాగా మరికొన్ని కంపెనీలు పెంచాయి. టాటా మోటార్స్, నిస్సాన్, రెనో, స్కోడా కంపెనీలు ధరలను 3 శాతం వరకూ (రూ.50,000 వరకూ) పెంచుతున్నట్లు తెలిపాయి. ఈ పెంపు వచ్చే నెల నుంచి వర్తిస్తుందని ఆ కంపెనీలు పేర్కొన్నాయి.
పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను తట్టుకోవడానికి ధరలను పెంచక తప్పడం లేదని ఆ కంపెనీలు వివరించాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడం వల్ల వచ్చిన ప్రతికూల ప్రభావాన్ని ఈ ధరల పెంపు కొంత ఉపశమనాన్ని ఇస్తుందని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా చెప్పారు. ఈ కంపెనీ రూ.4.47 లక్షలున్న మైక్రా నుంచి రూ.12.91 లక్షలున్న ఎస్‌యూవీ టెర్రానో వరకూ వివిధ మోడళ్లను విక్రయిస్తోంది.
డాట్సన్ బ్రాండ్ కింద రూ.3.23 లక్షలున్న డాట్సన్ గో కారు నుంచి రూ.4.76 లక్షలున్న డాట్సన్ గో ప్లస్ కార్లను కూడా విక్రయిస్తోంది. ఇక రెనో కంపెనీ మొత్తం ఏడు మోడళ్లను భారత్‌లో విక్రయిస్తోంది. వీటి ధరలన్నింటినీ 3 శాతం వరకూ పెంచుతున్నామని రెనో కంపెనీ తెలిపింది. ఈ కంపెనీ రూ.2.56 లక్షలు ఖరీదున్న క్విడ్ నుంచి రూ.23.47 లక్షల ఖరీదున్న కొలియోస్ మోడళ్లతో పాటు పల్స్, స్కేలా, డస్టర్, లాడ్జీ, ఫ్లూయెన్స్ మోడళ్ల కార్లను విక్రయిస్తోంది.
మరోవైపు అన్ని మోడళ్ల ధరలను రూ. 14,000 నుంచి రూ.50,000 వరకూ పెంచుతున్నామని స్కోడా కంపెనీ పేర్కొంది. మోడళ్లను బట్టి ధరలను 2-3 శాతం రేంజ్‌లో పెంచుతున్నామని పేర్కొంది. ప్రస్తుతం ఈ కంపెనీ నాలుగు మోడళ్లను-రాపిడ్, ఆక్టేవియా, యెటి, సూపర్బ్ మోడళ్లను అమ్ముతోంది. కాగా ఇప్పటికే మారుతీ సుజుకీ,హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ కంపెనీలు కార్ల ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు పేర్కొన్నాయి.
టాటా మోటార్స్... రూ.20,000 వరకూ
ప్రయాణికుల వాహనాల ధరలను రూ.20,000వరకూ పెంచుతున్నామని టాటా మోటార్స్ పేర్కొంది. వివిధ ఆర్థిక కారణాల వల్ల ధరలను పెంచకతప్పడం లేదని వివరించింది. ఈ కంపెనీ రూ. 1.99 లక్షల ఖరీదున్న నానో జెనెక్స్ నుంచి రూ.15.51 లక్షల ఖరీదున్న ఆరియా వరకూ వివిధ మోడళ్లను విక్రయిస్తోంది.