నిస్సాన్ కూడా పెంచేసింది...
న్యూఢిల్లీ: జపనీస్ కార్ మేకర్ నిస్సాన్ కూడా కార్ల ధరలను పెంచేస్తోంది. భారీ ఉత్పత్తి వ్యయాల కారణంగా వచ్చే నెలనుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు నిస్పాన్ మోటార్ ఇండియా మంగళవారం ప్రకటించింది. నిస్సాన్ డాట్సన్ మోడల్ కార్ల ధరను దేశంలో జనవరి, 2017 నుంచి రూ 30,000 వరకు పెంచుతున్నట్టు నిస్సాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఉత్పాదక వ్యయం ఫలితంగా ధరలను పెంచుతున్నామనీ, పరిశ్రమలో నెలకొన్న పోటీని తట్టుకోవడానికి సవరించిన ఈ ధరలు తమకు సాయపడనున్నాయని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా ప్రకటించారు. ఎంట్రీ లెవల్ చిన్న కారు డాట్సన్ గో (రూ.3.28 లక్షలు) మొదలు, నిస్సాన్, డాట్సన్ బ్రాండ్లతో నిస్సాన్ ఎస్యూవీ టెర్రానో (రూ.13.75లక్షలు) లాంటి వాహనాలను సంస్థ విక్రయిస్తోంది.
కాగా టాటా మెటార్స్, టయోటా కూడా ఇటీవల తమ కార్లను ధరలను పెంచాయి. ప్యాసింజర్ వాహనాల ధరలను రూ .5,000 నుంచి రూ .25,000వరకుపెంచుతున్నట్టు వెల్లడించాయి. ఇన్పుట్ ఖర్చులు, విదేశీ మారక రేట్ల కారణగా టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకెఎం) ధరలను 3 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే.