టాటా సన్స్ డైరెక్టర్‌గా మిస్త్రీపై వేటు!
వచ్చే నెల 6న ఈజీఎం
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ, టాటా సన్స్ అసాధారణ సర్వసభ్య సమావేశం (ఈజీఎం) వచ్చే నెల 6న జరగనున్నది. సైరస్ మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నామని టాటా సన్స్ తెలిపింది. చైర్మన్‌గా తొలగించిన తర్వాత మిస్త్రీ టాటా గ్రూప్ ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో నిరాధార ఆరోపణలు చేశారని, కంపెనీ రహస్య ఫైళ్లను బహిర్గతం చేశారని పేర్కొంది. ఆయన కారణంగా టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయిందని, వాటాదారులకు పరోక్షంగా నష్టం వాటిల్లిందని వివరించింది.
చైర్మన్‌గా మిస్త్రీని టాటా సన్స్ గతం ఏడాది అక్టోబర్ 24న తొలగించిన విషయం తెలిసిందే. మిస్త్రీ డైరెక్టర్‌గా ఉన్న టాటా గ్రూప్ కంపెనీల నుంచి ఆయనను తొలగించడానికి ఆయా కంపెనీలు ఈజీఎంలను కూడా నిర్వహించాయి. ఈజీఎంలు జరుగుతుండగానే ఆయన ఆరు టాటా కంపెనీల డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు తనను చైర్మన్‌గా తొలగించినందుకు టాటా సన్స్, ప్రస్తుత చైర్మన్ రతన్ టాటాలపై సైరస్ మిస్త్రీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలు చేశారు.