టాటా మోటార్స్లో నేడు ఏం జరుగబోతుంది?
టాటా మోటార్స్లో నేడు ఏం జరుగబోతుంది?
Published Tue, Dec 13 2016 8:45 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
ముంబాయి : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్ధాంతరంగా బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి కష్టకాలం వెన్నంటే ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రూప్లోని ఒక్కొక్క కంపెనీ మిస్త్రీని చైర్మన్గానే కాక, డైరెక్టర్గాను పీకేస్తున్న సంగతి తెలిసిందే. అసాధారణ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటుచేసి మరీ డైరెక్టర్గా ఆయన్ను తొలగించేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ ఆటో దిగ్గజం ఉన్న టాటా మోటార్స్ మిస్త్రీని తొలగించడానికి డిసెంబర్ 22న షేర్హోల్డర్స్ మీటింగ్ నిర్వహించబోతుంది. ఈ మీటింగ్లో మిస్త్రీకి వ్యతిరేకంగా ఓటింగ్లో పైచేయి సాధించడానికి రహస్యంగా షేర్లను కొనుగోలుచేయాలని టాటా సన్స్ భావిస్తోంది. దీనికోసం నేడు ఓ భారీ బ్లాక్డీల్ను టాటా సన్స్ నిర్వహించబోతుందట. ఓ రహస్య క్లయింట్ కోసం విదేశీ బ్రోకరేజ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ 5 కోట్ల షేర్లను, సోమవారం ముగింపు ధర రూ.454.4కు 10 శాతం ప్రీమియంగా కొనుగోలు చేస్తోందని తెలుస్తోంది. ఈ డీల్ మొత్తం విలువ రూ.2,500కోట్లగా ఉండబోతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇది టాటా మోటార్స్ ఈక్విటీ క్యాపిటల్లో 1.73 శాతం. ఈ లావాదేవీ మంగళవారమే జరిగే అవకాశముందని తెలుస్తోంది.
మిస్త్రీకి వ్యతిరేకంగా ఓటింగ్ లో నెగ్గడానికి కంపెనీలో 33 శాతం కంటే ఎక్కువగా తమ హోల్డింగ్ను పెంచుకోవాలని టాటా సన్స్ భావిస్తోందని, ఈ మేరకే వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్లో టాటా సన్స్ 33 శాతం వాటా కలిగి ఉంది. ఈ అదనపు షేర్ల కొనుగోలు ద్వారా మిస్త్రీకి అనుకూలంగా ఓట్లు వేసే వారిమీద టాటా సన్స్ పైచేయి సాధించనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఓపెన్ లెటర్ అవసరం లేకుండా ఒక ఆర్థికసంవత్సరంలో ప్రమోటర్స్ కంపెనీలో 5 శాతం మాత్రమే వాటా కొనుగోలు చేసే అవకాశముంది. చారిత్రాత్మకంగా టాటా గ్రూప్ రహస్య డీల్ ద్వారా గ్రూప్ కంపెనీలో తన వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాగ, టాటా సన్స్ ఆదేశాల మేరకు కంపెనీ బోర్డు నుంచి మిస్త్రీని తొలగించడానికి ఆరు దిగ్గజ కంపెనీలు ముందస్తుగా అన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. అదేవిధంగా టాటా సన్స్ నుంచి మెజార్టీ సపోర్టు పొందాలని ఆశిస్తున్నాయి. ఈ రహస్య భారీ బ్లాక్ డీల్ ద్వారా గ్రూప్ కంపెనీల భవిష్యత్తును కాపాడటానికి పేరెంట్ కంపెనీ ఏదైనా చేయగలదనే సందేశాన్ని మార్కెట్లోకి పంపనుందని సంబంధిత వర్గాలు చెప్పాయి.
Advertisement
Advertisement