బ్రిటన్‌లో టాటా ‘స్పెషాలిటీ స్టీల్’ విక్రయం పూర్తి
న్యూఢిల్లీ: టాటా స్టీల్ బ్రిటన్‌లోని తన స్పెషాలిటీ స్టీల్ వ్యాపారాన్ని లిబర్టీ హౌస్ గ్రూపునకు 10 కోట్ల పౌండ్ల(సుమారు రూ.850 కోట్లు)కు అమ్మేసింది. దక్షిణ యార్క్‌షైర్‌లోని ఆస్తులు, ఎలక్ట్రిక్ ఆర్క్ స్టీల్ వర్క్స్, రోతెర్‌హామ్‌లోని బార్‌మిల్లు, స్టాక్స్‌బ్రిడ్స్‌లోని స్టీల్ శుద్ధీకరణ కేంద్రం, బ్రిన్స్‌వర్త్‌లోని మిల్లు విక్రయించిన వాటిలో ఉన్నట్టు టాటా స్టీల్ తెలిపింది. స్పెషాలిటీ స్టీల్ విక్రయానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ ఒప్పందం చేసుకోగా, దాన్ని పూర్తి చేసినట్టు తాజాగా ప్రకటించింది.
స్పెషాలిటీ స్టీల్ విభాగంలో 1,700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఏరోస్పేస్, ఆటోమోటివ్, ఆయిల్, గ్యాస్ రంగాలకు ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇక స్ట్రిప్ ఉత్పత్తుల వ్యాపారాన్ని మార్చే పనిలో ఉన్నామని కంపెనీ తెలిపింది. ఆటోమోటివ్, నిర్మాణ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను స్ట్రీల్ స్ట్రిప్ విభాగం అందిస్తుండగా, ఇకపైనా 8,500 మందికి ఉపాధి కల్పించనుందని కంపెనీ పేర్కొంది. 2007లో టాటా స్టీల్ బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద స్టీల్ కంపెనీ కోరస్‌ను కొనుగోలు చేయగా, ఆ తర్వాత 1.5 బిలియన్ డాలర్లు(రూ.9వేల కోట్లకుపైగా) పెట్టుబడులు పెట్టింది. అయినప్పటికీ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కంపెనీ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. దీంతో వ్యాపార పునర్వ్యవస్థీకరణపై దృష్టిపెట్టింది.
300 మందికి ఉద్యోగాలు: సంజీవ్ గుప్తా
టాటా స్టీల్ స్పెషాలిటీ స్టీల్ వ్యాపారాన్ని సొంతం చేసుకున్న లిబర్టీ హౌస్ భారత సంతతి సంజీవ్ గుప్తాకు చెందినది. కొత్తగా 300 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని, మిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టనున్నామని గుప్తా ఈ సందర్భంగా తెలిపారు.