
న్యూఢిల్లీ: టాటా స్టీల్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఐదు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.232 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.1,136 కోట్లకు పెరిగినట్లు టాటా స్టీల్ తెలిపింది.
మొత్తం ఆదాయం రూ.29,255 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.33,672 కోట్లకు చేరిందని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ టీవీ. నరేంద్రన్ తెలిపారు. ఇబిటా 57 శాతం వృద్ధితో రూ.5,697 కోట్లకు పెరిగిందని, ఇబిటా మార్జిన్ 3.9 శాతం పెరిగి 17 శాతానికి చేరిందని చెప్పారాయన. ఇతర ఆదాయం 74 శాతం వృద్ధితో రూ.226 కోట్లకు పెరిగింది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.12,800 కోట్లకు మించకుండా నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని నరేంద్రన్ వెల్లడించారు. రైట్స్ ఇష్యూ ఈ నెల 14న మొదలై 28న ముగుస్తుంది.
ఇదే జోరు కొనసాగుతుంది...!
గత తొమ్మిది నెలల్లో తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాల్లో మంచి పనితీరు సాధించామని నరేంద్రన్ పేర్కొన్నారు. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉండటంతో ఇదే జోరు కొనసాగుతుందనే అంచనాలున్నాయన్నారు. చైనాలో వాణిజ్య పరిస్థితులు మెరుగుపడటంతో అంతర్జాతీయంగా ఉక్కు ధరలు జోరుగా ఉన్నాయని, భారత్‌లో వివిధ రకాల ఉక్కు ఉత్పత్తుల విక్రయాలు పెరిగాయని తెలియజేశారు.
కళింగనగర్ ప్లాంట్‌ను విస్తరిస్తున్నామని, వేరే కంపెనీల ప్లాంట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కళింగనగర్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్ టన్నులకు పెంచుతున్నామని, ఈ ప్రాజెక్ట్ కోసం రూ.23,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని, ఈ ప్రాజెక్ట్ నాలుగేళ్లలో పూర్తవుతుందని వివరించారు.
రూ. 22,544 కోట్ల నగదు నిల్వలు..
ఈ క్యూ3లో కంపెనీ స్థూల రుణ భారం రూ.1,658 కోట్లు తగ్గిందని కంపెనీ సీఎఫ్‌ఓ కౌశిక్ చటర్జీ చెప్పారు. భారత్‌లో అమ్మకాలు పుంజుకోవడం, కమోడిటీ ధరలు పెరగడంతో వివిధ దేశాల్లో రియలైజేషన్లు మెరుగుపడడం, విదేశీ మారక ద్రవ్య ప్రభావం దీనికి కారణమన్నారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.22,544 కోట్లుగా ఉన్నాయన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టాటా స్టీల్ షేర్ 1.8 శాతం లాభంతో రూ.684 వద్ద ముగిసింది.