‘టియాగో’తో మార్కెట్ వాటా పెరుగుతుంది
టాటా మోటార్స్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ బర్మన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల మార్కెట్లో ఒకానొక దశలో దాదాపు 17 శాతం వాటా దక్కించుకున్న టాటా మోటార్స్... 2016 ఫిబ్రవరి నాటికి 6.5 శాతం వాటాతో సరిపెట్టుకుంది. మూడేళ్లు శ్రమించి మార్కెట్లోకి తెచ్చిన ‘టియాగో’తో సంస్థ పూర్వ వైభవం సంతరించుకుంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్ బిజినెస్ యూనిట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్.బర్మన్ చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో గురువారం టియాగో విడుదల చేసిన సందర్భంగా కస్టమర్ సపోర్ట్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ భాసిన్, వెహికిల్ ఇంజనీరింగ్ హెడ్ అనంద్ విజయ్ కులకర్ణితో కలిసి మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా 60 వేల మందికిపైగా టియాగో పట్ల ఆసక్తి కనబరిచారని తెలిపారు. దశలవారీగా నూతన మోడళ్లతో ర్యాంకు మెరుగు పర్చుకుంటామన్నారు. ఆటో ఎక్స్‌పోలో 20 కొత్త మోడళ్లను టాటా మోటార్స్ ప్రదర్శించడం తెలిసిందే. వీటిలో కొద్దిరోజుల్లో హెక్సా క్రాస్ ఓవర్‌ను కంపెనీ ప్రవేశపెడుతోంది. ఆ తర్వాత కాంపాక్ట్ సెడాన్ కైట్-5(కోడ్ నేమ్), సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సన్ రానున్నాయని బర్మన్ చెప్పారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో టియాగో కారు ధర వేరియంట్‌నుబట్టి రూ.3.32-5.69 లక్షలుంది.