టాటా వెయిట్‌లాస్ చికిత్స!
గ్రూపులో టెక్నాలజీ కంపెనీలన్నీ టీసీఎస్ కిందకు
► ఇన్‌ఫ్రా కంపెనీలన్నీ మరో కంపెనీగా మార్పు
►గ్రూపు ఆధ్వర్యంలోని కంపెనీల సంఖ్య కుదింపు
► సరిపడని వాటిని విక్రయించడం
► చంద్రశేఖరుడి సారథ్యంలో మొదలైన కసరత్తు
ముంబై: ఉప్పు తయారీ నుంచి సాఫ్ట్‌వేర్ సేవల వరకు ఎన్నో రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాటా గ్రూపులో మేధోమథనం మొదలైంది. 100కు పైగా కంపెనీలు, ఒకే రంగంలో కూడా ఒకటికి మించి కంపెనీ లు ఉండడంపై గ్రూప్ పునరాలోచనలో పడింది. ఇలా అయితే పర్యవేక్షణ సరిగా ఉండడం లేదన్న అభిప్రాయం యాజమాన్యంలో మొదలైంది. దీనికి పరిష్కారంగా కంపెనీల సంఖ్యను క్రమబద్ధీకరించే పనిలో పడింది. ముందుగా టెక్నాలజీ కంపెనీలను టీసీఎస్ గొడుకు కిందకు తీసుకురావాలనుకుంటోంది. ఈ దిశగా గ్రూపు పునర్వ్యవస్థీకరణపై కార్యాచరణ మొదలైనట్టు స్వయంగా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ ఇటీవల వెల్లడించారు.
టీసీఎస్ కిందకు పలు కంపెనీలు
టాటా గ్రూపు పునర్వ్యవస్థీకరణ టెక్నాలజీ కంపెనీలతో మొదలు కానుంది. టెక్నాలజీకి సంబంధించి టాటా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీలన్నింటినీ టీసీఎస్ కిందకు తీసుకురావాలనేది ప్రణాళిక. ఒకవేళ టీసీఎస్‌లో ఇమడలేని చిన్న కంపెనీలేవైనా ఉంటే వాటిని విక్రయించే ఆలోచనతో ఉంది. కంపెనీలు ఎక్కువ కావడంతో పర్యవేక్షణ లోపించి పనితీరు మెరుగ్గా ఉండడం లేదన్నది గ్రూపు భావన. అందుకే ఈ దిశగా ఆలోచనలు చేస్తోందన్నది ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల సమాచారం.
అయితే, టీసీఎస్‌లో ఏ కంపెనీలను విలీనం చేయాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం మాత్రం జరగలేదని ఆ వర్గాలు తెలిపాయి. టాటా గ్రూపునకు టీసీఎస్ అక్షయపాత్ర లాంటిది. గ్రూపునకు సమకూరే మొత్తం లాభాల్లో మూడింట రెండు వంతులు ఒక్క టీసీఎస్ నుంచే వస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి టాటా ఎలెక్సీ అనే మరో కంపెనీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయి ఉంది. ఇది టెక్నాలజీ ఉత్పత్తుల ఇంజనీరింగ్ సంస్థ. ఇంకా ఈ రంగానికి సంబంధించి కంప్యూటర్ ఆధారిత లర్నింగ్ ఉత్పత్తులను విక్రయించే టాటా ఇంటరాక్టివ్ సిస్టమ్స్‌తోపాటు టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ పేరుతో ఇంకో కంపెనీ కూడా గ్రూపు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
ఆ తర్వాత ఇన్‌ఫ్రా
ఇన్‌ఫ్రా రంగంలోని కంపెనీలను కూడా ఒక్కటిగా చేయాలని టాటా గ్రూపు యోచన. ఏసీలు, ఎయిర్‌కూలర్లను విక్రయించే వోల్టాస్ ఇంజనీరింగ్, నీటిశుద్ధి ప్రాజెక్టుల నిర్మాణంలోనూ సేవలందిస్తోంది. అలాగే, టాటా రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా ఉంది. ఇది బ్రిడ్జిలు, ఎయిర్ పోర్టుల రంగంలో ఉంది. ఇక టాటా ప్రాజెక్ట్స్ రోడ్లు, రైల్వేలు, విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్ విభాగాల్లో సేవలు అందిస్తోంది.
గ్రూపునకు కొత్త కళ
103 బిలియన్ డాలర్ల టాటా గ్రూపు చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది ఆరంభంలో బాధ్యతలు చేపట్టారు. టీసీఎస్‌ను టాటా గ్రూపునకు కల్పవృక్షంగా మార్చిన వారిలో ఈయన కూడా ఒకరు. అంతకుముందు టాటా– మిస్త్రీల వివాదంతో గ్రూపు సతమతమయింది. దీనివల్ల టాటా గ్రూపు ప్రతిష్ట కూడా కొంచెం ప్రమాదంలో పడింది. దీంతో టీసీఎస్‌కు బాస్‌గా ఉన్న చంద్రశేఖరన్‌ను చైర్మన్ పదవికి తగిన వ్యక్తిగా యాజమాన్యం ఎంచుకుంది. చేపట్టిన బాధ్యతల్లో తనదైన ముద్రవేసే తత్వం చంద్రది. ఈ తరహా వ్యక్తి కావడంతో టాటా గ్రూపు పునర్వ్యవస్థీకరణ అవసరమని భావించారు.
రాబడుల నిష్పత్తిని పెంచడం, దేశీయ వినియోగంపై దృష్టి సారించడం, టాటా బ్రాండ్లను బలోపేతం చేయడం, కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని రంగాల్లోనూ దూసుకుపోవడం ద్వారా గ్రూపు విలువను పెంచడంపై దృష్టి నిలిపారు. గ్రూపు కంపెనీల్లో కొన్ని ఒకదానిలో ఒకటి వాటాలు కలిగి ఉండగా (క్రాస్ హోల్డింగ్), ఆ వాటాలను ప్రమోటర్లు కొనుగోలు చేయాలనేది ఓ ప్రణాళిక. తాజాగా కంపెనీల క్రమబద్ధీకరణపైనా కరసరత్తు మొదలైంది. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే, ‘‘వేగంగా పరిగెత్తాలంటే లావుగా ఉంటే కుదరదు. సన్నబడాల్సిందే’’ అని చంద్రశేఖరన్ తాజాగా పేర్కొనడం గమనార్హం. నష్టాలతో ఉన్న కంపెనీలతో గ్రూపు విలువను పెంచలేమని కూడా ఆయన ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా స్పష్టం చేశారు.