ఎఫ్‌డీలకు సెలవ్..!
• ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు ఎన్నో
• వడ్డీ రేట్లూ తగ్గినంత కాలం డెట్ ఫండ్స్ ఆకర్షణీయమే
• పోస్టాఫీసు పథకాల్లోనూ మెరుగైన రాబడులు
• ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌తో రాబడులు, పన్ను ఆదా
బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇతర స్థిరాదాయ పథకాలపైనా వడ్డీ రేట్లు ఆశాజనకంగా లేవు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఒక శాతానికి మించి రాబడులను ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మంచి రాబ డుల కోసం ఇన్వెస్టర్లు ఈ ప్రత్యామ్నాయాల వైపు చూడొచ్చు.
డెట్ మ్యూచువల్ ఫండ్స్
⇔ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లలో రాబడులకు హామీ ఉండదు కానీ, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మించి రాబడులను ఇస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. డెట్ ఫండ్స్‌లోనూ రిస్క్ కాల వ్యవధులను బట్టి... లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇన్‌కమ్, డైనమిక్ బాండ్ ఫండ్స్ ఇలా భిన్న రకాలు ఉన్నాయి.
⇔ నెలకోసం అయితే లిక్విడ్‌ఫండ్ అనువుగా ఉంటుంది.
⇔ నెల నుంచి మూడు నెలల వరకు పెట్టుబడి పెట్టేట్టు అయితే అల్ట్రా షార్ట్ టర్మ్ ఎంచుకోవచ్చు.
⇔ కనీసం ఓ ఏడాది పాటు పెట్టుబడి కదిలించను అని అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్ ఫండ్ లో పెట్టుబడి పెట్టవచ్చు.
⇔ పెట్టుబడుల కాల వ్యవధి మూడేళ్లు అయినా çపర్వాలేదనుకుంటే ఇన్‌కమ్ ఫండ్ అనువైనది.
⇔ మొదటి మూడు ఫండ్లలో రిస్క్ ఉండదు. ఇన్‌కమ్ ఫండ్, మూడేళ్లకు మించి పెట్టుబడి కోసం ఎంచుకునే ఫండ్లలో రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి.
డైనమిక్ బాండ్ ఫండ్స్
స్థిరమైన రాబడులకు డైనమిక్ బాండ్స్ లో అవకాశం ఉంటుంది. భిన్న రకాల కాల వ్యవధులు, వడ్డీ రేట్లతో కూడిన పథకాల్లో మదుపు ద్వారా స్థిరమైన, మోస్తరు రాబడులను అందిస్తాయి.
అక్రూయెల్ డెట్ ఫండ్స్
పెట్టుబడిలో కొంత భాగం అక్రూయెల్ డెట్ ఫండ్స్ కు కేటాయించుకోవడం కూడా సమంజసమే. వీటిలో పెట్టుబడులు కాలాన్ని బట్టి కాకుండా వడ్డీ రేట్ల ప్రాధాన్యం ఆధారంగానే ఉంటాయి. దీంతో రిస్క్ దాదాపుగా ఉండదు.
ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ (ఎఫ్‌ఎంపీ)
ఈ పథకాలు బ్యాంకు ఎఫ్‌డీల కంటే అర శాతం నుంచి ఒక శాతం ఎక్కువ రాబడులను ఇస్తాయి. గడువు తీరే వరకు వీటిలో పెట్టుబడులను కొనసాగించడం వల్ల వడ్డీ రేట్ల పరంగా ఆటు పోట్లు లేకుండా చూసుకోవచ్చు.
పోస్టాఫీసు పథకాలు
పోస్టాపీసు పథకాల వడ్డీ రేట్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయి. పీపీఎఫ్‌పై రాబడులకు పన్ను ప్రయోజనాలు, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనపై కూడా వడ్డీ రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి.
నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్‌సీడీ)
కంపెనీలు జారీ చేసే ఎన్‌సీడీలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లనే ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీ ఆర్థిక సామర్థ్యం, వ్యాపారం వృద్ధిలో ఉందా, బ్యాలన్స్ షీటు తదితర వివరాలు పరిశీలించే ఇన్వెస్ట్‌చేయాలి. లేదంటే అసలుకే ముప్పు ఏర్పడుతుంది.
ట్యాక్స్ ఫ్రీ బాండ్స్
అధిక పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఇవి చక్కగా నప్పుతాయి. 10 నుంచి 20 ఏళ్ల కాలంలో అధిక రాబడులను అందుకోవచ్చు.