దేశీయ అతిపెద్ద టెక్నాలజీ సంస్థ టీసీఎస్ అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించింది. నేడు ప్రకటించిన మార్చి క్వార్టర్ ఫలితాల్లో కంపెనీ నికర లాభం రూ.6,904 కోట్లగా పేర్కొంది. ఏడాది ఏడాదికి ఇది 4.48శాతం పెంపుగా తెలిపింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ కంపెనీ రూ.6,812 కోట్ల లాభాలను మాత్రమే ఆర్జిస్తుందని తెలిసింది. కానీ అంచనాలను బీట్ చేసి టీసీఎస్ లాభాలను ఆర్జించింది. కంపెనీ గత క్వార్టర్‌లో రూ.6531 కోట్ల లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో గత మూడు క్వార్టర్ల నుంచి కంపెనీ ప్రతికూల లాభాల వృద్ధిని నమోదు చేస్తూ వచ్చాయి. కానీ ఈ క్వార్టర్‌లో మెరుగైన లాభాలను ఆర్జించాయి. సీక్వెన్షియల్ బేసిస్‌లో ఈ ఐటీ దిగ్గజం లాభాల్లో 5.71 శాతం వృద్ధిని సాధించింది. ఆపరేషన్స్ నుంచి నికర ఆదాయాలు రూ.32,075 కోట్లగా నమోదైనట్టు టీసీఎస్ తెలిపింది. ఈబీఐటీ మార్జిన్లు ఈ క్వార్టర్‌లో సీక్వెన్షియల్‌గా 20 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీ ఈక్విటీ షేర్లపై 1:1 బోనస్‌ను బోర్డు ఆమోదం తెలిపినట్టు ప్రకటించింది. అంటే షేర్‌హోల్డర్స్ ఒక్కో షేరుకు మరో షేరు బోనస్‌గా రానుంది. అంతేకాక ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.29 ఫైనల్ డివిడెంట్‌ను కూడా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారని తెలిపింది.
డాలర్ విలువల్లో టీసీఎస్ రెవెన్యూలు 4,972 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు కంపెనీ చెప్పింది. అంటే ఏడాది ఏడాదికి ఇది 11.7 శాతం పెంపు అని పేర్కొంది. డాలర్ రెవెన్యూ వృద్ధిలో తాము రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్నట్టు తెలపడం చాలా ఆనందదాయకంగా ఉందని కంపెనీ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ అన్నారు. అన్ని పరిశ్రమల వ్యాప్తంగా డిజిటల్‌కు బలమైన డిమాండ్‌ను సాధించినట్టు తెలిపారు. ఇటీవల ఏడాదుల్లో తమకు నమోదైన మంచి క్వార్టర్స్‌లో ఇదీ ఒకటని పేర్కొన్నారు. బలమైన వృద్ధితో పాత ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ఎంతో విశ్వాసంతో అడుగుపెడుతున్నామని చెప్పారు. తమ కస్టమర్లకు వారి వ్యాపారాలను 4.0 జర్నీస్‌లోకి తీసుకెళ్తున్నారని, తాము కూడా వారి వృద్ధికి సహకరించడానికి డిజిటల్ టెక్నాలజీల ద్వారా సాయం అందిస్తున్నట్టు తెలిపారు. కాగ, గతవారం ఇన్ఫోసిస్ కూడా తన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యూ4లో ఆ కంపెనీ రూ.3,690 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు రిపోర్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment