2016-17 నాటికి 5 బిలియన్ డాలర్లు..
టెక్ మహీంద్రా ఆదాయ లక్ష్యం ఇది
ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్
హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టెక్ మహీంద్రా 2016-17 నాటికి 5 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా చేసుకుంది. రానున్న రోజుల్లో తమ కంపెనీతోపాటు పరిశ్రమకూ సాఫ్ట్‌వేర్ రంగంలో సానుకూల ఫలితాలు ఉంటాయని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ వినీత్ నయ్యర్ తెలిపారు. ఇది మంచి సంకేతమని, సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సమీపంలోని బహదూర్‌పల్లి వద్ద ఏర్పాటైన మహీంద్రా గ్రూప్‌కు చెందిన ప్రీమియర్ ఇంజనీరింగ్ కళాశాల మహీంద్రా ఇకోల్ సెంట్రల్ క్యాంపస్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ 3 బిలియన్ డాలర్ల ఆదాయంపై సుమారు 50 కోట్ల డాలర్ల నికర లాభం నమోదు చేసింది. భారీ కాంట్రాక్టుల మూలంగానే ఇంత మొత్తంలో ఆదాయం ఆర్జించగలిగామని ఆయన చెప్పారు. 4-5 బిలియన్లకు చేరుకోవడం అంత సులువేం కాదన్నారు. సత్యం కంప్యూటర్ స్కాంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్నాం. సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. మాలాగే ప్రభుత్వం కూడా యోచిస్తే పరిష్కారం తప్పకుండా ఉంటుంది. మాపై న్యాయపరమైన కేసు ఉండదని భావిస్తున్నాం. ఒకవేళ ఉంటే సవాల్ చేస్తాం’ అని స్పష్టం చేశారు.