- టెక్ మహీంద్ర కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో టెక్ మహీంద్రపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) మోపిన అభియోగాలను నమోదు చేసేందుకు కింది కోర్టుకు బుధవారం హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మనీ ల్యాండరింగ్ చట్టం కింద ఈడీ కింది కోర్టులో తమపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ టెక్ మహీంద్ర హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని విచారించిన సింగిల్ జడ్జి, ఈడీ కేసును కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ ఈడీ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేయగా బుధవారం చీఫ్‌జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అభియోగాల నమోదులో పాల్గొనాలని టెక్ మహీంద్రకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.