టెక్ మహీంద్రాకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహేంద్రకు ఉమ్మడి హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామచంద్రరావు ఇవాళ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, టెక్ మహేంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవుపై వెళ్లాలని కూడా వేధిస్తోందని తెలిపారు.
దీనిపై రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందని వివరించారు. కార్మిక శాఖ జాయింట్ కమిషన ర్ చర్యలు తీసుకునేలోపే ఆ కంపెనీ ఉద్యోగుల్ని తొలగించడం అన్యాయమని, ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగా తొలగించరాదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 47(2) స్పష్టం చేస్తోందన్నారు.
ఈ సెక్షన్ నుంచి ఐటీ కంపెనీలకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22 అమలు కాకుండా హైకోర్టు గతంలోనే స్టే ఇచ్చిందని, కాబట్టి ఈ నిబంధన ఐటీ కంపెనీలకు వర్తిస్తుందని ఆయన వివరించారు. ఇటీవల కాలంలో పలు ఐటీ కంపెనీలు నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమిషనర్ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్యప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న టెక్ మహీంద్ర కంపెనీతోపాటు తెలంగాణ కార్మిక శాఖ అధికారులకు నోటీసులు జారీ చేసింది. టెక్ మహీంద్రకు వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు పిటిషనర్‌కు అనుమతినిస్తూ విచారణను వాయిదా వేసింది.