టెక్ మహీంద్రాపై కేసు తగదు..
ఈడీ కేసును కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణానికి సంబంధించి టెక్ మహీంద్రాకు హైకోర్టులో ఊరట లభించింది. సత్యం కుంప్యూటర్స్ కుంభకోణం విషయంలో టెక్ మహీంద్రాపై మనీ లాండరింగ్ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన అవకతవకలకు టెక్ మహీంద్రా బాధ్యత వహించాలనడం తగదని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్ మహీంద్రాపై ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ అభియోగాలన్నింటినీ హైకోర్టు తోసిపుచ్చింది. ఆ మేర టెక్ మహీంద్రాపై ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు సోమవారం తీర్పు వెలువరించారు. సత్యం కంప్యూటర్స్‌పై నమోదు చేసిన కేసును ఆ కంపెనీని విలీనం చేసుకున్న తరువాత కూడా ఈడీ తమపై కొనసాగించడాన్ని, చార్జిషీట్‌లో తమను నిందితులుగా చేర్చడాన్ని సవాలు చేస్తూ టెక్ మహీంద్రా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీనిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి, సోమవారం మధ్యాహ్నం తీర్పునిచ్చారు. టెక్ మహీంద్రా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ రుజువు చేయలేకపోయిందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు, ఆ కంపెనీకి చెందిన ఇతరులు చేసిన తప్పులను టెక్ మహీంద్రాకు ఆపాదించడం తగదని స్పష్టం చేశారు. అధికరణ 226 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేసే అధికారం హైకోర్టుకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు.