హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా ఈడీ వ్యవహరిస్తోంది
⇒ యథాతథ స్థితి ఆదేశాలున్నా ఆస్తుల స్వాధీనానికి ప్రయత్నిస్తోంది
⇒ హైకోర్టును ఆశ్రయించిన ఎనిమిది కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా ఈడీ అధికారులు ఆస్తుల స్వాధీనానికి ప్రయతిస్తున్నారని సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి, న్యాయవాది శ్రీరాం న్యాయస్థానానికి నివేదించారు. ఆస్తుల జప్తునకు సంబంధించి మార్చి 10 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని అప్పిలేట్ అథారిటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా ఈడీ అధికారులు నోటీసులిచ్చా రని తెలిపారు. ఈడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వైఎస్ భారతితోపాటు హరీశ్ ఇన్‌ఫ్రా, క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, సిలికాన్ ఇన్‌ఫ్రా, భగవత్ సన్నిధి, క్లాసిక్‌రియాల్టీ, యుటోపియా ఇన్‌ఫ్రా, రేవన్ ఇన్‌ఫ్రా, సిలికాన్ బిల్డర్స్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ రామలింగేశ్వర్ రావు బుధవారం విచారించారు.
ఆస్తుల జప్తునకు సంబంధించి అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించామని, మార్చి 10 వరకు యథాతథ స్థితి కొన సాగించాలని అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందని, అయినా ఈడీ నోటీసులిచ్చిందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎందుకు నోటీసులు జారీ చేశారని న్యా యమూర్తి ఈడీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. మార్చి 10 వరకు ఆస్తులను స్వాధీనం చేసుకోబోమని, సింబాలిక్ పొజిషన్ కోసమే నోటీసులు జారీ చేశామని ఈడీ తరఫు న్యాయ వాది సురేశ్‌కుమార్ నివేదించారు. ఇలాంటివి నోట్‌ఫైల్‌లో రికార్డు చేసుకోవాలని, పబ్లిక్ నోటీ సులు ఎలా జారీ చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ పిటిషన్లపై విచారణ ముగిస్తే ఈడీ ముందుకెళ్లే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై వారి చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. స్పందించిన న్యాయమూర్తి.. అఫిడవిట్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేశారు.