ఈడీ బదిలీ పిటిషన్‌పై 29లోపు నిర్ణయం తీసుకోండి
సీబీఐ కోర్టుకు హైకోర్టు ఆదేశం
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే విధించింది. సీబీఐ కేసులను కూడా ఈడీ కోర్టుకు బదిలీ చేయాలంటూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానం నిర్ణయం తీసుకునేంత వరకు జగన్ కేసులో విచారణ జరపవద్దని ఈడీ కోర్టును హైకోర్టు ఆదేశించింది.
కేసుల బదిలీ నిమిత్తం ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 29వ తేదీలోపు తగిన నిర్ణయం తీసుకోవాలని సీబీఐ న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటివరకు జగన్ కేసులో విచారణ చేపట్టవద్దని ఈడీ కోర్టును ఆదేశిస్తూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.
జగతి పబ్లికేషన్స్‌లో కన్నన్, మాధవ రామచంద్ర తదితరులు పెట్టిన రూ.36 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దీంతో ఈడీ కోర్టు కేసు విచారణ ప్రారంభించింది. సీబీఐ కోర్టులో విచారణ జరుగుతుండగా, అందుకు సమాంతరంగా ఈడీ కోర్టు విచారణ జరపడం సరికాదని, సీబీఐ కోర్టులో కేసు తేలేంతవరకు ఈడీ కేసు విచారణను వాయిదా వేయాలని జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు ఈడీ కోర్టును కోరారు. అయితే వీరి అభ్యర్థనను ఈడీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మరోసారి విచారించారు.