ఈడీ అత్యుత్సాహానికి హైకోర్టు బ్రేక్!
► భారతీ సిమెంట్స్ కేసులో అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై స్టే
► అధికారుల తీరు వల్ల అనవసర వివాదం ఏర్పడిందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: భారతి సిమెంట్స్ కేసులో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అత్యుత్సాహానికి ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ కేసులో స్థిర, చరాస్తులు, ఫిక్సడ్ డిపాజిట్ల ప్రాథమిక జప్తును సమర్థిస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ గత నెల 23న జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు సంబంధించి తదుపరి చర్యలేవీ తీసుకోవద్దంటూ మంగళవారం ఈడీని ఆదేశించింది. ఆ ఉత్తర్వులపై 45 రోజుల్లో అప్పీ లు చేసుకునే అవకాశమున్న నేపథ్యంలో... అప్పీలు దాఖలు చేసుకుని, స్టే పిటిషన్ పై నిర్ణయం వెలువడే వరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంది. అలాగే హైకోర్టు అభిప్రాయాల ప్రభావానికి లోనుకాకుండా స్వతంత్రంగా అప్పీలుపై నిర్ణయం తీసుకోవాలని అప్పిలేట్ అథారిటీకి సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అప్పీలుకు గడువున్నా చర్యలేమిటి?
అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వుల నేపథ్యంలో.. బ్యాంకుల్లోని తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర స్థిర చరాస్తులను బదలాయించుకునేందుకు ఈడీ చేపట్టిన చర్యలను సవాలు చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, మరికొన్ని కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్.రవిచందర్, ఎస్.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లేందుకు చట్టం 45 రోజుల గడువునిచ్చిందని, కానీ ఈడీ మాత్రం తాము ఆ గడువును వినియోగించుకోవడానికి ముందే చర్యలు ప్రారంభించిందని కోర్టుకు వివరించారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లను తమ పేరున బదలాయించుకునేందుకు బ్యాంకులకు ఈడీ నోటీసులు పంపిందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఈడీ చాలా తొందరపాటుతో వ్యవహరిస్తోందని నివేదించారు. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు 235 పేజీల మేర ఉన్నాయని.. వాటిపై రాత్రికి రాత్రే అప్పీలు దాఖలు చేయడం సాధ్యం కాదని న్యాయమూర్తికి వివరించారు. గతంలో కూడా ఈడీ ఇదే విధంగా తొందరపాటుతో వ్యవహరించగా.. ఇదే హైకోర్టు స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం ఈడీ న్యాయవాది పి.ఎస్.పి.సురేశ్‌కుమార్ స్పందిస్తూ... మనీలాండరింగ్ చట్ట నిబంధనల మేరకే తాము వ్యవహరిస్తున్నామని కోర్టుకు చెప్పారు.
గత నెల 23న అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే ఇప్పటివరకు పిటిషనర్లు అప్పీలు చేయలేదన్నారు. చట్ట ప్రకారం అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఆస్తుల బదలాయింపు చర్యలు ప్రారంభించవచ్చన్నారు. ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్ల బదలాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయిందని.. ఈడీ పేరు మీద డీడీలు కూడా సిద్ధమయ్యాయని తెలిపారు. మిగిలిన స్థిర, చరాస్తుల బదలాయింపునకు నోటీసులు జారీ చేయనున్నామన్నారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇప్పటికే బదలాయింపు ప్రక్రియ పూర్తయినవిగాక మిగతా ఆస్తుల విషయంలో తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ఈడీని ఆదేశించారు. ఈ సమయంలో ఈడీ న్యాయవాది స్పంది స్తూ.. ఇటువంటి ఉత్తర్వులతో ఇది ఓ ఆనవాయితీగా మారుతుందని, ప్రతీసారి ఇలాంటి పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.
కానీ ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ‘అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే అంటే.. ఆ మరుసటి రోజునేనా..?’ అని ప్రశ్నించారు. ఇది అనవసర వివాదమని, చట్టం అప్పీలుకు 45 రోజుల గడువు ఇచ్చినప్పుడు, అందుకు అనుగుణంగా వ్యవహరించి ఉండాల్సిందని స్పష్టం చేశారు. అధికారుల వల్లే ఈ అనవసర వివాదం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా ఈ ఉత్తర్వుల నేపథ్యంలో మంగళవారం మరికొన్ని కంపెనీలు కూడా ఈడీ చర్యలపై హైకోర్టును ఆశ్రయించాయి.