టెక్ మహీంద్రా లాభం రూ. 614 కోట్లు
ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా జనవరి-మార్చి(క్యూ4) కాలానికి దాదాపు 4% తక్కువగా రూ. 614 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో రూ. 638 కోట్లను ఆర్జిం చింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఇదే కాలానికి కంపెనీ ఆదాయం మాత్రం 34%పైగా పుంజుకుని రూ. 5,058 కోట్లయ్యింది.
అంతక్రితం రూ. 3,767 కోట్ల ఆదాయం నమోదైంది. కంపెనీలో సత్యం కంప్యూటర్స్ విలీనమైన సంగతి తెలిసిందే. ఇక డాలర్ల రూపేణా నికర లాభం 10.1 కోట్ల డాలర్లకు చేరగా, ఆదాయం 18%పైగా ఎగసి 82.5 కోట్ల డాలర్లను తాకింది. వేగంగా మారుతున్న ప్రపంచంలో కస్టమర్ల నుంచి డీల్స్ పొందడం, వృద్ధిని అందుకోవడం వంటి అంశాలలో పటిష్ట పనితీరును చూపుతున్నామని, ఈ విషయాన్ని ఫలితాలు వెల్లడిస్తున్నాయని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ వ్యాఖ్యానించారు. వాటాదారులకు షేరుకి రూ. 10 డివిడెండ్‌ను చెల్లించనుంది.
పూర్తి ఏడాదికి
పూర్తి ఏడాదికి(2013-14) మాత్రం కంపెనీ నికర లాభం దాదాపు 55% జంప్‌చేసి రూ. 3,029 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ. 1,956 కోట్ల లాభం నమోదైంది. ఇదే కాలానికి ఆదాయం కూడా 31%పైగా ఎగసి రూ. 18,831 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 14,332 కోట్ల ఆదాయాన్ని సాధించింది. డాలర్ల రూపేణా నికర లాభం 49.8 కోట్ల డాలర్లుకాగా, ఆదాయం దాదాపు 18% పుంజుకుని 309 కోట్ల డాలర్లుగా నమోదైంది. దేశీయంగా అతిపెద్ద విలీనాన్ని పూర్తిచేయడం ద్వారా సమీకృత కంపెనీగా ఎదిగినట్లు కంపెనీ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ పేర్కొన్నారు.
కొత్తగా 6,333 మందికి ఉద్యోగాలివ్వడం ద్వారా కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 89,441ను చేరింది. దీనిలో సాఫ్ట్‌వేర్ నిపుణుల సంఖ్య 60,997కాగా, బీపీవో విభాగంలో 21,830 మంది పనిచేస్తున్నారు. మార్చి చివరికల్లా రూ. 363 కోట్లమేర రుణాలు నమోదుకాగా, నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 3,599 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో షేరు 1% లాభపడి రూ. 1,838 వద్ద ముగిసింది.