న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా హోరాహోరీ పోరులో గణనీయంగా టారిఫ్‌లను తగ్గించాల్సి వచ్చి తీవ్రంగా దెబ్బతిన్న టెలికామ్ కంపెనీలు... క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి టెలికం మార్కెట్లో స్థిరత్వం, హేతుబద్ధత తిరిగి రాగలదన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. పరస్పరం దెబ్బతీసుకునే చార్జీల విధానానికి స్వస్తి చెప్పి..లాభాలు, ఆదాయాలు పెంచుకోవడానికి టెల్కోలు కొత్త మార్గాలను అన్వేషిస్తుండటం ఇందుకు దోహదపడుతుందని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ అంచనా వేస్తోంది. ‘ధరల విషయంలోనూ, ఇతర సంస్థల కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలోనూ కొన్నాళ్లుగా మార్కెట్ పరిస్థితి అసంబద్ధంగా మారింది. అయితే, క్రమంగా మార్కెట్లో స్థిరత్వం, హేతుబద్ధత తిరిగి వస్తాయని ఆశిస్తున్నాం‘ అని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీవోఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ చెప్పారు. ‘పరిశ్రమపరంగా చూస్తే పోటాపోటీగా టారిఫ్‌లు తగ్గించడం మొదలుకుని అత్యంత దారుణ పరిస్థితులన్నీ ఈ మధ్య కాలంలో చూడటం జరిగింది. నిధుల సమీకరణలో సవాళ్ల వల్ల మార్కెట్ క్రమంగా స్థిరపడుతున్నట్లుగా కనిపిస్తోంది. గతం ఎంత దుర్భరంగా ఉండేదనేది పక్కన పెట్టి భవిష్యత్‌పై సానుకూల దృక్పథంతో పరిశ్రమ ముందుకెడుతోంది‘ అని మాథ్యూస్ చెప్పారు.
కొత్త మార్గాలవైపు దృష్టి..
ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఆదాయాలు, లాభాల తగ్గుదలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికం సంస్థలు మరిన్ని కొత్త మార్గాల వైపు దృష్టి పెడుతున్నాయని మాథ్యూస్ చెప్పారు. కంటెంట్, ఈ–కామర్స్, ఆర్థిక సేవలు మొదలైనవన్నీ కూడా అందించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘గడిచిన 5–6 త్రైమాసికాలుగా ఆదాయాలు, లాభదాయకత తగ్గడాన్ని చూశాం. దీనికి అడ్డుకట్ట పడొచ్చు. వ్యక్తిగతంగానైతే... ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికల్లా ఆదాయాల క్షీణతకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాను‘ అని ఆయన చెప్పారు.
ఆశావహంగా టెల్కోల ఫలితాలు
అసాధారణ ఆదాయం ఊతంతో గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో అనూహ్యంగా లాభంలో 29 శాతం వృద్ధితో టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ అందర్నీ ఆశ్చర్యపర్చింది. రిలయన్స్ జియో రాకతో తీవ్రంగా దెబ్బతిన్న ఎయిర్‌టెల్.. జనవరి– మార్చి త్రైమాసికంలో రూ. 107.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. పలు త్రైమాసికాల తర్వాత లాభంలో వృద్ధి నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కంపెనీ ఆదాయం కూడా 6.2 శాతం ఎగిసి రూ.20,602.2 కోట్లకు పెరిగింది. మరోవైపు, రిలయన్స్ జియో నికర లాభం 64.7 శాతం పెరిగి రూ.840 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో జియో లాభం రూ. 510 కోట్లు. 2018–19 నాలుగో త్రైమాసికంలో జియో నిర్వహణ ఆదాయం 55.8 శాతం పెరిగి రూ. 11,106 కోట్లకు చేరింది. అంతక్రితం సంవత్సరం ఇదే వ్యవధిలో నిర్వహణ ఆదాయం రూ. 7,128 కోట్లు. మరో టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా మే 13న ఆర్థిక ఫలితాలు వెల్లడించనుంది.
ఎయిర్‌టెల్ సిగ్నల్: ఫిచ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ మార్చి క్వార్టర్ నికర లాభం 29 శాతం వృద్ధి చెందడం ఆధారంగా చూస్తే.. ఈఏడాదిలో దేశీ మొబైల్ రంగ ఆదాయం 5–10 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉందని ఫిచ్ రేటింగ్స్ అంచనావేసింది. ఈ రంగంలోని టాప్–3 కంపెనీలు లాభదాయకత వైపు దృష్టిసారించేందుకు ఆస్కారం ఉండగా.. వీటి మార్కెట్ వాటా ప్రతి కంపెనీకి 30–33 శాతం మధ్య ఉండనుందని అంచనాకట్టింది. ఈ సంస్థల మధ్య కొనసాగుతున్న పోటీతత్వం ఇక నుంచి నెమ్మదిగా తగ్గిపోయి.. డేటా టారిఫ్ పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) నెలకు 10–20 శాతం వృద్ధి చెంది 1.6–1.7 డాలర్లకు చేరుతుందని అంచనావేసింది.
Comments
Please login to add a commentAdd a comment