
సాక్షి, ముంబై: భారత టెలికాం పరిశ్రమలో సంచలనాలకు నాంది పలికిన రిలయన్స్ జియోకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్. ముఖ్యంగా ఉచిత సేవలతో ప్రత్యర్థికంపెనీలకు దడ పుట్టించిన జియో మరో విధ్వంసానికి కూడా కారణమైంది. కంపెనీల ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో 75వేల ఉద్యోగాలు హుష కాకి అయిపోయాయి. అంతేకాదు జియో ప్రభావం మరింత ప్రమాదకరంగా ఇక ముందు పెరిగే అవకాశంఉందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఉపాధి లేక రోడ్డున పడే ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దేశీయ టెలికం కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.
ఎకనామిక్ టైమ్స్ అందించిన రిపోర్ట్ ప్రకారం గత ఏడాది మూడు లక్షలమంది ఉద్యోగులను వివిధ టెలికాం కంపెనీలు నియమించుకోగా వీరిలో 25శాతం మందిపై వేటు పడిందని పేర్కొంది. దీంతో ఉద్యోగుల సంఖ్య 2.25 లక్షలకు కుంచించుకుపోగా పరిశ్రమనువదిలి వెళుతున్న 30శాతం మంది మిడిల్ మేనేజ్‌మెంట్ విభాగంవారు వుండటం గమనార్హం. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఒత్తిడి, పోటీతత్వంతో టెలికాం ఆపరేటర్లు అల్లకల్లోమవుతున్నారని, టవర్ బిజినెస్, ఆస్తులు అమ్ముకుంటున్నాయని నివేదించింది.
మరోవైపు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ కమిటీ అందించిన సమాచారం ప్రకారం 2017 జనవరి-ఏప్రిల్ మధ్యకాంలం 1.5 మిలియన్ల ఉద్యోగాలు పోయాయి. అలాగే టెలికాం రంగం రానున్న కాలంలో మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనుందని రిక్రూట్మెంట్ కంపెనీలు కూడా భావిస్తున్నాయి. ఇక ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం కూడా లేదని తేల్చి చెపుతున్నాయి.
కాగా పరిశ్రమలోకి జియో ఎంట్రీ ఇవ్వడంతో టెలికాం రంగం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. దిగ్గజ కంపెనీలన్నీ ఉక్కిరి బిక్కిరవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన వైర్‌లెస్ సేవలకు స్వస్తి చెప్పింది. దీనికి తోడు ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్ తమ టవర్ల వ్యాపారాన్ని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment