టెలిఫోన్ వినియోగదారులు @ 100.93 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య జూలై నెలలో 100.93 కోట్లకు చేరినట్లు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. ఈ సంఖ్య జూన్ నెలలో 100.69 కోట్లుగా ఉంది. వినియోగదారుల నెలవారీ వృద్ధి 0.23 శాతంగా నమోదైంది. జూన్ నెల చివరి నాటికి 58.42 కోట్లుగా ఉన్న పట్టణ ప్రాంత వినియోగదారుల సంఖ్య జూలై నెల చివరకు 58.85 కోట్లకు పెరిగింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంత వినియోగదారుల సంఖ్య 42.27 కోట్ల నుంచి 42.07 కోట్లకు త గ్గింది. వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య 98.32 కోట్లకు పెరిగింది.
వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్య 2.61 కోట్లకు తగ్గింది. వైర్‌లెస్ వినియోగదారుల సంఖ్య పరంగా చూస్తే.. జూలై నెలలో ఎయిర్‌టెల్‌కు కొత్తగా 10 లక్షల మంది, ఐడియాకు 7 లక్షల మంది, రిలయన్స్‌కు 5 లక్షల మంది వినియోగదారులు జతయ్యారు. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సంఖ్య 5 లక్షలు, ఎయిర్‌సెల్ వినియోగదారుల సంఖ్య 3 లక్షలు, టాటా వినియోగదారుల సంఖ్య లక్ష మేర, వోడాఫోన్ వినియోగదారుల సంఖ్య 65,104 పెరిగింది.