పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా మిశ్రా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా(69) బుధవారం నియమితులయ్యారు. మిశ్రా నియామకానికి ప్రతిబంధకంగా ఉన్న ట్రాయ్ చట్ట సవరణ కోసం కేంద్రం ఏకంగా ఓ ఆర్డినెన్స్ జారీ చేయడం విశేషం. మిశ్రా 1967 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ రిటైర్డ్ అధికారి. ట్రాయ్ చైర్మన్‌గా మిశ్రా 2009లో రిటైర్ అయ్యారు. అయితే ట్రాయ్ చట్టం ప్రకారం చైర్మన్, సభ్యులుపదవీ విరమణ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పదవి చేపట్టడానికి వీల్లేదు. దీంతో ఈ చట్టాన్ని సవరిస్తూ మోడీ సర్కారు ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీగా మిశ్రా పదవీ కాలం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లేదా ప్రస్తుత ప్రధాని పదవీకాలం ముగిసే వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.