Nripendra Misra
-
‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈ ఏడాది అక్టోబర్‌కల్లా గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు. ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్‌తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు. ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది. -
ఆగస్టులో రామాలయం పనులు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శనివారం అయోధ్యలో సమావేశమై ముహూర్తం ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా శుక్రవారం అయోధ్య చేరుకున్నారు. ఆగస్టులో ఆలయ పనుల ప్రారంభంపై ప్రధాని ఆమోదించిన తేదీని ఈ సమావేశంలో ఆయన ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అయిన మిశ్రా వెంట నిపుణులైన ఇంజనీరింగ్ అధికారుల బృందం కూడా వచ్చిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధికారులు ఆలయ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తారని సమాచారం. వచ్చే నెలలో రామాలయ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీతోపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రెసిడెంట్ మహంత్ నృత్య గోపాల్ దాస్ తెలిపారు. ‘ఆలయ భూమి పూజ ఆన్లైన్ ద్వారా గానీ లేదా ఇతర వర్చువల్ విధానాల్లో గానీ ప్రారంభించాలని సాధువులు కోరుకోవడం లేదు. ప్రధాని స్వయంగా ఈ కార్యక్రమానికి రావాలని వారు భావిస్తున్నారు. నా ఆహ్వానాన్ని ప్రధాని ఆమోదిస్తారనే నమ్మకం ఉంది’అని గోపాల్ దాస్ అన్నారు. ఆగస్టులో ప్రధాని మోదీ అయోధ్య సందర్శనపై పీఎంవో నుంచి ఎటువంటి సమాచారం లేదు. -
ఆయనొక విలువైన నిధి : నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా పదవీ విరమణ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఆయన గత ఐదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో సీనియర్ అధికారిగా సేవలు అందించారని ‘ప్రభుత్వానికి విలువైన నిధి, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న వ్యక్తి, పని పట్ల ఉండే అంకితభావం గొప్పదని, సీనియర్ పౌర సేవకుడిగా ఆదర్శప్రాయమైన వృత్తిని నిర్వహించారని’ అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో కొనియాడింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ‘తాను ఢిల్లీకి వచ్చిన కొత్తలో నృపేంద్ర ఓ గైడ్‌లా వ్యవరించారని, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న గొప్ప అధికారని, పలు సమస్యలను తన నైపుణ్యంతో పరిష్కరించారని’ కార్యక్రమం అనంతరం మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌పై స్పందించిన నృపేంద్ర.. ‘నూతన భారతదేశ నిర్మాణంలో పనిచేసే అవకాశం లభించిందని భావించినట్టు’ తెలిపారు. నృపేంద్ర మిశ్ర 1967 బ్యాచ్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా, టెలికాం సెక్రటరీ ఆఫ్ ఇండియా, ఎరువుల శాఖకు కార్యదర్శిగా సేవలు అందించారు. 2014లో ప్రధాని మోదీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శిగా చేరడంతో ఆయనకు కేబినెట్ ర్యాంక్ లభించింది. ఆయన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లో పని చేస్తూ పలు నిబంధనలను సవరించారు. అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. కాగా ఆయన పదవీ విరమణ పొందినప్పటికీ జూన్ 11న నరేంద్ర మోదీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో రెండవసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. -
వైదొలిగిన ‘ప్రిన్సిపాల్ సెక్రటరీ’ మిశ్రా
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రిన్సిపాల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలిపారు. అయితే రెండు వారాలు ఆ పదవిలో కొనసాగాల్సిందిగా మోదీ ఆయనను కోరినట్లు ప్రభుత్వ ప్రధాన అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. పదవీ విరమణ పొందనున్న మిశ్రాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను పీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన కొత్తలో మిశ్రా చాలా సహాకారం అందించారని, దేశాభివృద్ధికి ఎంతో సేవ చేసిన ఆయనకు విరమణానంతరం అంతా మంచే జరగాలి’ అని ఆకాంక్షించారు. ప్రధానిగా మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన ప్రభుత్వంలో పనిచేయ డం గర్వంగా భావిస్తు న్నానని మిశ్రా తెలిపా రు. 1967 బ్యాచ్ ఐఏ ఎస్ అధికారి అయిన మిశ్రా వివిధ బాధ్యతల అనంతరం 2009లో ట్రాయ్ చైర్మన్‌గా వైదొలిగారు. 2014లో పీఎంవోలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ అయ్యారు. కేబినెట్ సెక్రటరీగా పదోన్నతి పొందిన పీకే సిన్హాకు పీఎంవోలో ఓఎస్డీగా ప్రభుత్వం బాధ్యతలు కల్పించింది. -
యోగి సర్కారుపై మోదీ డేగకన్ను!
కొత్తగా కొలువుదీరిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై నిశితమైన నిఘా పెట్టి.. తన కనుసన్నలలో ఉంచుకోవాలని నరేంద్రమోదీ ప్రభుత్వం భావిస్తున్నదా? ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా అందే ఆదేశాల ఆధారంగానే యోగి ప్రభుత్వం నడుచుకోవాలని అనుకుంటున్నాదా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. యూపీ ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించడానికి మోదీ ప్రభుత్వం అసాధారణరీతిలో సీనియర్ ఐఏఎస్ అధికారి నృపేంద్రమిశ్రాను నియమించినట్టు తెలుస్తోంది. పీఎంవో ప్రిన్సిపాల్ సెక్రటరీ అయిన మిశ్రా ఆదివారం సీఎం యోగితో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ప్రధాని మోదీకి, సీఎం యోగికి మధ్య దూతగా మిశ్రా వ్యవహరించనున్నారని, ఆయన నిత్యం యోగితో భేటీ అయి.. ఉత్తరప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టు ఇండియా టుడే ఓ కథనంలో తెలిపింది. యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్ర మిశ్రాను 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ ప్రత్యేకంగా కేంద్రానికి పిలిపించుకున్నారు. యూపీ ప్రభుత్వం ఇకముందు చేపట్టబోయే నియామకాలన్నీ మిశ్రా ధ్రువీకరించిన తర్వాతే చేపట్టనున్నట్టు సమాచారం. -
ట్రాయ్ బిల్లు సవరణకు లోక్ సభ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నియామకానికి అడ్డంకులు తొలిగించుకునే క్రమంలో ప్రభుత్వం తొలి అడుగును అధిగమించింది. సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన ట్రాయ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో మిశ్రా నియామకం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ట్రాయ్ చట్ట సవరణ బిల్లు ఈ రోజు లోక్ సభలో మూజువాణితో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభ నుంచి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. అంతకముందు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా అది కాస్తా వీగిపోయింది. నృపేంద్ర మిశ్రా నియామకంపై గత మేనెల 28వ తేదీన ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 1967 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ అధికారి అయిన మిశ్రాను ప్రభుత్వ పదవిలో నియమించడం ట్రాయ్‌చట్టం ప్రకారం సాధ్యంకాదు కాబట్టి, ఆయన నియామకానికి చట్టబద్ధతకోసం ఆర్డినెన్స్ స్థానంలో ట్రాయ్ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చింది. -
ఒక వ్యక్తికోసం చట్టాన్నే ఉల్లంఘిస్తున్నారు
నృపేంద్ర మిశ్రా నియామకంపై సభలో రభస ప్రభుత్వంపై టీఎంసీ, కాంగ్రెస్ విమర్శలు గందరగోళం మధ్యనే సభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నియామకానికి చట్టబద్ధమైన అడ్డంకులు తొలగించుకునేందుకు ప్రభుత్వం ఒక బిల్లును శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పదవీ విరమణ చేసిన నృపేంద్ర మిశ్రా నియామకం చట్ట బద్ధతను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు ఎంత ఆక్షేపణ వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోకుండా బిల్లును ప్రవేశపెట్టింది. నృపేంద్ర మిశ్రా నియామకంపై గత మేనెల 28వ తేదీన ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రిటైర్డ్ అధికారి అయిన మిశ్రాను ప్రభుత్వ పదవిలో నియమించడం ట్రాయ్‌చట్టం ప్రకారం సాధ్యంకాదు కాబట్టి, ఆయన నియామకానికి చట్టబద్ధతకోసం ఆర్డినెన్స్ స్థానంలో ట్రాయ్ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ బిల్లు నియమ నిబంధనలను ఉల్లంఘించేదిగా, ట్రాయ్ చట్టం స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసేదిగా ఉందని సభలో తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఆక్షేపించటం తో గందరగోళం చెలరేగింది. ప్రభుత్వ చర్య చట్టవ్యతిరేకమంటా కాంగ్రెస్ పార్లమెంటు వెలుపల వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తికోసం చేస్తున్న అపవిత్ర చర్య అని ధ్వజమెత్తింది. అయినా తన చర్యను ప్రభుత్వం గట్టిగా సమర్థించుకుంది. బిల్లును తీసుకువచ్చే పూర్తిస్థాయి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయని, కాంపిటీషన్ కమిషన్ వంటి సంస్థలతో సమానంగా ట్రాయ్‌కి ప్రతిపత్తి కలిగించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 1967వ సంవత్సరం బ్యాచ్‌కి చెందిన ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్ర మిశ్రాను మే 28న ఆర్డినెన్సు ద్వారా ప్రిన్సిపల్ కార్యదర్శిగా ప్రధాని కార్యాలయంలో నియమించారు. రైల్వే బడ్జెట్ లీక్‌పై రగడ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే బడ్జెట్ ప్రతులు మీడియాకు లీక్ కావడంపై రాజ్యసభలో దుమారం రేగింది. రైల్వే బడ్జెట్ లీకేజీ చాలా తీవ్రమైన అంశమని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిస్తూ.. అధికారిక రహస్యాలు లీక్ అయిన పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. లోక్‌సభలో మంత్రుల గైర్హాజరుపై సర్కార్ ఇరకాటం లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో రైల్వే మంత్రి సదానంద గౌడ, డిప్యూటీమంత్రి మనోజ్ షా సభలో లేకపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మంత్రులు అందుబాటులో లేకపోవడాన్ని కాంగ్రెస్ సభలో తీవ్రంగా ఆక్షేపించింది. చర్చ విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రం జన్ చౌదరి వ్యాఖ్యానించారు. భోజన విరామం తర్వాత పది నిమిషాలకు రైల్వే మంత్రి సదానంద గౌడ, మరో మంత్రి మనోజ్ షా సభకు వచ్చి సభకు క్షమాపణ చెప్పారు. -
పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా మిశ్రా
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా(69) బుధవారం నియమితులయ్యారు. మిశ్రా నియామకానికి ప్రతిబంధకంగా ఉన్న ట్రాయ్ చట్ట సవరణ కోసం కేంద్రం ఏకంగా ఓ ఆర్డినెన్స్ జారీ చేయడం విశేషం. మిశ్రా 1967 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ రిటైర్డ్ అధికారి. ట్రాయ్ చైర్మన్‌గా మిశ్రా 2009లో రిటైర్ అయ్యారు. అయితే ట్రాయ్ చట్టం ప్రకారం చైర్మన్, సభ్యులుపదవీ విరమణ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పదవి చేపట్టడానికి వీల్లేదు. దీంతో ఈ చట్టాన్ని సవరిస్తూ మోడీ సర్కారు ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీగా మిశ్రా పదవీ కాలం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు లేదా ప్రస్తుత ప్రధాని పదవీకాలం ముగిసే వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మోడీ ముఖ్య కార్యదర్శిగా నృపేంద్ర మిశ్ర
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ మాజీ చీఫ్ నృపేంద్ర మిశ్రను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆయన నియామకం బుధవారం నుంచే అమలులోకి వస్తుంది. మిశ్ర నిక్కచ్చిగా, నిజాయితీగా వ్యవహరించే అధికారిగా, గంటల పాటు కష్టపడి పనిచేసే వ్యక్తిగా పేరొందారు. ఆయన సరళీకృత ఆర్ధిక విధానాలను, గట్టి నిర్ణయాలను సమర్థించే వ్యక్తి. ఆయన రాకతో విధానాల్లో కీలక మార్పులుంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. మిశ్ర 1967 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయన ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు. ఆయన మాజీ టెలికాం మంత్రి రాజా హయాంలో చేసిన 2 జీ స్పెక్ట్ర్రమ్ కేటాయింపులను గట్టిగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఆయన 2 జీ విచారణ సమయంలో సాక్ష్యం కూడా ఇచ్చారు.