న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మాజీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నియామకానికి అడ్డంకులు తొలిగించుకునే క్రమంలో ప్రభుత్వం తొలి అడుగును అధిగమించింది. సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన ట్రాయ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంతో మిశ్రా నియామకం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ట్రాయ్ చట్ట సవరణ బిల్లు ఈ రోజు లోక్ సభలో మూజువాణితో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభ నుంచి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. అంతకముందు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టినా అది కాస్తా వీగిపోయింది.
నృపేంద్ర మిశ్రా నియామకంపై గత మేనెల 28వ తేదీన ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 1967 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ అధికారి అయిన మిశ్రాను ప్రభుత్వ పదవిలో నియమించడం ట్రాయ్‌చట్టం ప్రకారం సాధ్యంకాదు కాబట్టి, ఆయన నియామకానికి చట్టబద్ధతకోసం ఆర్డినెన్స్ స్థానంలో ట్రాయ్ సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకువచ్చింది.