యోగి సర్కారుపై మోదీ డేగకన్ను!
కొత్తగా కొలువుదీరిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై నిశితమైన నిఘా పెట్టి.. తన కనుసన్నలలో ఉంచుకోవాలని నరేంద్రమోదీ ప్రభుత్వం భావిస్తున్నదా? ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నేరుగా అందే ఆదేశాల ఆధారంగానే యోగి ప్రభుత్వం నడుచుకోవాలని అనుకుంటున్నాదా? అంటే తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. యూపీ ప్రభుత్వ పనితీరును పర్యవేక్షించడానికి మోదీ ప్రభుత్వం అసాధారణరీతిలో సీనియర్ ఐఏఎస్ అధికారి నృపేంద్రమిశ్రాను నియమించినట్టు తెలుస్తోంది.
పీఎంవో ప్రిన్సిపాల్ సెక్రటరీ అయిన మిశ్రా ఆదివారం సీఎం యోగితో 45 నిమిషాలపాటు భేటీ అయ్యారు. ప్రధాని మోదీకి, సీఎం యోగికి మధ్య దూతగా మిశ్రా వ్యవహరించనున్నారని, ఆయన నిత్యం యోగితో భేటీ అయి.. ఉత్తరప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టు ఇండియా టుడే ఓ కథనంలో తెలిపింది. యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్ర మిశ్రాను 2014లో ప్రధాని అయిన తర్వాత మోదీ ప్రత్యేకంగా కేంద్రానికి పిలిపించుకున్నారు. యూపీ ప్రభుత్వం ఇకముందు చేపట్టబోయే నియామకాలన్నీ మిశ్రా ధ్రువీకరించిన తర్వాతే చేపట్టనున్నట్టు సమాచారం.