నిలిచిన అట్టపెట్టెల తయారీ
⇒ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో కూడా...
⇒ క్రాఫ్ట్ పేపర్ ధర పెరగడమే కారణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అట్ట పెట్టెల తయారీలో వాడే క్రాఫ్ట్ పేపర్ ధరను మిల్లులు ఇష్టారాజ్యంగా పెంచడాన్ని నిరసిస్తూ వేలాది కంపెనీలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 19 నుంచి 21 వరకు, తమిళనాడులో 20 నుంచి 23 వరకు తయారీ పనులను కంపెనీలు ఆపేశాయి. రెండు నెలల్లో కిలో క్రాఫ్ట్ పేపర్ ధరను మిల్లులు రూ.7 దాకా పెంచాయని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా కారుగేటెడ్ బాక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ మాజీ ప్రెసిడెంట్ ఎం.ఎల్.అగర్వాల్ సోమవారమిక్కడ మీడియాతో అన్నారు. మిల్లుల సంఘాలే ధర పెంచుతూ నిర్ణయం తీసుకుని సభ్య కంపెనీలకు సమాచారం ఇవ్వడాన్నిబట్టి చూస్తుంటే కుమ్మక్కు అయినట్టు కనిపిస్తోందని ఆరోపించారు. పేపర్ ధర పెరిగినా క్లయింట్లు ధర సవరించకపోవడంతో పెట్టెల తయారీ కంపెనీలు నష్టాలను చవిచూస్తున్నట్టు చెప్పారు.
సరఫరా ఎక్కువే అయినా..
దేశవ్యాప్తంగా 50 లక్షల టన్నుల అట్ట పెట్టెలు తయారవుతున్నాయి. 9 శాతం వృద్ధితో పరిశ్రమ విలువ రూ.20,000 కోట్లుంది. దేశంలో 25,000 కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2,500 దాకా ఉన్నాయి. మొత్తం 7,50,000 మందికిపైగా ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు. క్రాఫ్ట్ పేపర్ పూర్తిగా దేశీయంగా ఉన్న మిల్లులే సరఫరా చేస్తున్నాయని అగర్వాల్ తెలిపారు. డిమాండ్ కంటే పేపర్ ఉత్పత్తి అధికంగా ఉన్నా ధర పెంచుతున్నాయని అన్నారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు నెలకు అయిదు రోజులు మిల్లులు మూసి వేస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము కూడా ధర పెంచాల్సిందేనని, లేదంటే కంపెనీలు మూసివేయాల్సిన పరిస్థితి ఉందని అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ ఎమ్వీఎం భరత్ తెలిపారు.