సామాజిక స్కీమ్‌లు బ్యాంకులకు భారం | The bank burden of social schemes | Sakshi
Sakshi News home page

సామాజిక స్కీమ్‌లు బ్యాంకులకు భారం

Published Sat, Aug 29 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

సామాజిక స్కీమ్‌లు బ్యాంకులకు భారం

సామాజిక స్కీమ్‌లు బ్యాంకులకు భారం

♦ ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య
♦ ప్రభుత్వ మద్దతులేకుంటే వీటి నిర్వహణ కష్టమని వ్యాఖ్య
 
 ముంబై : పేమెంట్ బ్యాంకులపై వివాదాస్పద వ్యాఖ్య లు చేసి, అటు తర్వాత వెనక్కు తగ్గిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)  వంటి సామాజిక భద్రతా పథకాలు బ్యాంకులకు ఆర్థిక భారంగా మారుతున్నాయని అన్నారు. ఇలాంటి పథకాలు పటిష్టంగా కొనసాగి, బ్యాంకులకూ ఆర్థికంగా ఇబ్బంది కాకుండా ఫలప్రదం కావాలంటే కేంద్రం మద్దతు అవసరమని పేర్కొన్నారు. ఆయా పరిస్థితులను కేంద్రం ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.శుక్రవారం నాడు ఇక్కడ ఆమె బ్యాంక్ బ్రోకరేజ్ విభాగం- ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్ కొత్త కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు...

 ► పీఎంజేడీవై పటిష్టరీతిలో అమలు కావాలని కేంద్రం కోరుకుంటోంది. అయితే బ్యాంకింగ్‌కు ఇది చాలా కష్టం. బ్యాంకింగ్ వ్యాపార ప్రయోజనాలకు సరిపడకపోవడమే దీనికి కారణం. అలాంటప్పుడు ఇది నీరుగారిపోక తప్పదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని  ఇలాంటి పథకాలు పటిష్టంకావడానికి కేంద్రం బ్యాంకులకు తగిన మద్దతు అందించే చర్యలు చేపట్టాలి. నిర్వహణా భారం తగ్గించాలి.
► పీఎంజేడీవై విజయవంతానికి ప్రభుత్వంతో ఇప్పటికే మేము కలిసి పనిచేస్తున్నాం. అయితే బ్యాంకులే ఈ పథకాన్ని నిర్వహించాలి తప్ప, మేము చేసేదేంలేదని ప్రభుత్వం భావిస్తోందని నేను అనుకోను. కాగా ప్రభుత్వం ఏమి చేయాలన్న అంశంపై మాత్రం మేము కసరత్తు చేస్తున్నాం.
 
 జన్ ధన్ యోజన ద్వారా రూ.22,000 కోట్ల సమీకరణ
 న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జన్‌ధన్ యోజన కింద 17.5 కోట్ల బ్యాంక్ అకౌంట్ల ద్వారా రూ.22,000 కోట్లు డిపాజిట్ అయ్యాయి. దేశంలో ప్రజలందరికీ బ్యాంకింగ్ సౌలభ్యం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా సరిగ్గా ఏడాది క్రితం ఆగస్టు 28న ఈ యోజనను ప్రారంభమైంది.  ఈ యోజన ద్వారా ‘కుటుంబానికి ఒక అకౌంట్ ప్రారంభం’ లక్ష్యం నెరవేరినట్లు ఆర్థికశాఖ తెలిపింది.
 
 రెపో యథాతథం!
 సెప్టెంబర్ 29న జరిగే ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలుచేసే వడ్డీరేటు- ప్రస్తుతం 7.25 శాతం) రేటును యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. మార్కెట్ల అనిశ్చితి, రూపాయి ఒడిదుడుకులు దీనికి కారణమని తాను భావిస్తున్నానన్నారు. రేటు కోత పరిస్థితి ఉన్నా... సంబంధిత కారణాల వల్ల ఈ దిశలో నిర్ణయం తీసుకోకపోవచ్చునని విశ్లేషించారు. ఆగస్టు 31న వెలువడనున్న స్థూల దేశీయోత్పత్తి క్యూ1 ఫలితాల కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

 డాయిష్ బ్యాంక్ ఇలా...
 కాగా సెప్టెంబర్ సమీక్ష సందర్భంగా రెపో కోత ఉండవచ్చని జర్మన్ బ్రోకరేజ్ సంస్థ డాయిష్ బ్యాంక్ శుక్రవారం అంచనావేసింది. వృద్ధి-ద్రవ్యోల్బణం పరిస్థితులు ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఒడిదుడుకుల మార్కెట్‌లోనూ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే భారత్ పనితీరు బాగుందని విశ్లేషించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement