చిన్న వాహనాలకు పెద్ద కష్టాలు.. | The big difficulties to small vehicles | Sakshi
Sakshi News home page

చిన్న వాహనాలకు పెద్ద కష్టాలు..

Published Thu, Jul 30 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

చిన్న వాహనాలకు పెద్ద కష్టాలు..

చిన్న వాహనాలకు పెద్ద కష్టాలు..

♦ రుణమిచ్చేందుకు బ్యాంకులు ససేమిరా
♦ తగ్గిన చిన్న వాణిజ్య వాహన అమ్మకాలు
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : చిన్న వాణిజ్య వాహన (ఎస్‌సీవీ) రంగానికి పెద్ద కష్టాలే వచ్చిపడ్డాయి. మందగమనం ప్రభావం ఇంకా భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా వీడకపోవటంతో ఈ పరిశ్రమ అంతగా పురోగమించలేదు. మరోవంక సరుకు రవాణా రంగంలో అవసరానికి మించి వాహనాలున్నాయి. వాహన యజమానుల నుంచి నెలవారీ చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతో బ్యాంకుల వద్ద బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త వాహనాలకు ఆర్థిక సహాయం చేసేందుకు బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఈ అంశాలే ఎస్‌సీవీ విభాగ పురోగతిని అడ్డుకుంటున్నాయని టాటా మోటార్స్ చెబుతోంది. ఈ విభాగంలో అగ్రశ్రేణి సంస్థగా నిలిచిన తమపై కూడా ఈ ప్రభావం ఎక్కువేనంటోంది. చిన్న వాణిజ్య వాహన విభాగంలో టాటా మోటార్స్, మహీంద్రా, అశోక్ లేలాండ్, ఫోర్స్, పియాజియో, హిందుస్తాన్ మోటార్స్ పోటీపడుతున్నాయి.  

 30 శాతం దరఖాస్తులే..
 కొన్నేళ్ల కిందటిదాకా వాహన ఫైనాన్స్ కోసం 100 దరఖాస్తులు వస్తే.. 70 వరకు దరఖాస్తులను బ్యాంకులు ఓకే చేసేవి. కానీ ఇప్పుడు స్టోరీ మారింది. 30 దరఖాస్తులకు కూడా రుణం లభించడం లేదు. ఒకానొక దశలో 100 శాతం ఫైనాన్స్ సమకూర్చిన బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఇప్పుడు 50 శాతం ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నాయి. దీనంతటికీ కారణం బ్యాంకుల వద్ద బకాయిలు ఇబ్బడి ముబ్బడిగా ఉండడమే. రవాణా వ్యాపారం అంతగా సాగకపోవడంతో వాహన యజమానులు నెలవారీ వాయిదాలు చెల్లించలేకపోతున్నారు.

ఫైనాన్స్ కంపెనీలు వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. 2014-15లో చిన్న వాణిజ్య వాహన పరిశ్రమలో 30 శాతం నెగటివ్ వృద్ధి నమోదయినట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. ఎస్‌సీవీ విభాగంలో భారత్‌లో నెలకు సుమారు 12,000 వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇందులో టాటా మోటార్స్‌కు 85 శాతం వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది.  

 ఇంకా అట్టిపెట్టుకుంటున్నారు..
 సరుకు రవాణా కోసం అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక భారీ ట్రక్కుకు నాలుగు చిన్న వాహనాలు చొప్పున ఉన్నాయి. భారత్‌లో ఇది 2.5 మాత్రమే. ఇక గతంలో నాలుగైదేళ్లు కాగానే వాహనాన్ని మార్చి కొత్తది కొనేవారు. ఇప్పుడు రీప్లేసింగ్ కాలం 7-8 ఏళ్లకు వచ్చిందని టాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆర్.రామకృష్ణన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వ్యాపారాలు సరిగా లేక యజమానులు పాత వాహనాలనే కొనసాగిస్తున్నారని చెప్పారు. పోనీ వాహనం అమ్ముదామన్నా మంచి ధర వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే రోడ్డు మీద ఇబ్బడిముబ్బడిగా వాహనాలు ఖాళీగా తిరుగుతున్నాయి. వాహనం కొని కొన్ని నెలలైనా విక్రయిస్తే వచ్చే మొత్తం 50-60% మించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement