
భారత్ రేటింగ్ పెంపు ఇప్పట్లో కష్టమే!
- ద్రవ్యలోటు కట్టడి జాప్యంపై రేటింగ్ ఏజెన్సీల అసంతృప్తి
- బడ్జెట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించకపోతే ఇబ్బందేనని హెచ్చరిక
న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణ(ద్రవ్యలోటు కట్టడి) లక్ష్యం విషయంలో మోదీ సర్కారు జాప్యంపై అంతర్జాతీయ, దేశీయ రేటింగ్ ఏజెన్సీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తక్షణం భారత్ సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్‌ను పెంచే అవకాశాల్లేవని తేల్చిచెప్పాయి. అంతేకాకుండా బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2015-16) ప్రకటించిన ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్) లక్ష్యాన్ని గనుక అందుకోవడంలో విఫలమైతే ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించాయి.
ఈ ఏడాది(2014-15) స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో ద్రవ్యలోటు లక్ష్యం 4.1 శాతాన్ని అందుకోనున్నామని.. వచ్చే ఏడాదికి 3.9 శాతం, ఆపై ఏడాది 3.3 శాతం, 2017-18లో 3 శాతం లక్ష్యాన్ని సాధించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, గత అంచనాల మేరకు 2016-17 నాటికే 3 శాతం లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉంది. అంతేకాకుండా 2015-16 ఆర్థిక సంవత్సరానికి గతంలో కేంద్రం 3.6 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాన్ని కూడా తాజాగా పెంచడాన్ని రేటింగ్ ఏజెన్సీలు గుర్తు చేశాయి.
2015-16లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ.69,500 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ లక్ష్యం రూ.58,425 కోట్లుకాగా, రూ.31,350 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంచనా. మరోపక్క, ప్రభుత్వం సమీకరించే రుణాలను కేవలం ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పెంచేందుకు వీలుగా ఉత్పాదకత పెంపునకు మాత్రమే ఉపయోగించాలని కూడా రేటింగ్ ఏజెన్సీలు సూచించాయి. ముడిచమురు ధరలు దిగిరావడం, వృద్ధి పుంజుకుంటున్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యాల సాధనపై ఆందోళన వ్యక్తం చేశాయి. 3 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధనను మూడేళ్లకు పెంచడం రేటింగ్‌కు సంబంధించి తటస్థం(క్రెడిట్ న్యూట్రల్)గా పరిగణిస్తున్నట్లు మూడీస్ పేర్కొంది.
ప్రభుత్వం వృద్ధి పెంపుపై అధికంగా దృష్టిపెడుతున్నందున ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇబ్బందులు తప్పవని కూడా అభిప్రాయపడింది. అయితే, ప్రభుత్వ రుణ సమీకరణ నిధులను వృద్ధి పెంపునకు ఉపయోగించిన పక్షంలో అధిక ద్రవ్యలోటుతో ముప్పేమీ ఉండబోదని ఇండియా రేటింగ్స్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్‌అండ్‌పీ కూడా తాజాగా ద్రవ్యలోటు కట్టడి విషయంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని హెచ్చరించడం తెలిసిందే. ప్రస్తుతం ఎస్‌అండ్‌పీ ‘బీబీబీ మైనస్’(స్థిరమైన అవుట్‌లుక్‌తో), మూడీస్.. ‘బీఏఏ3’(స్థిర అవుట్‌లుక్) రేటింగ్‌ను కొనసాగిస్తున్నాయి.