
దేశంలో పూర్తిగా దిగివచ్చిన ఉల్లి ధర!
దేశంలో ఉల్లి టోకు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో... ఇక వీటి ఎగుమతుల పెంపుపై కేంద్రం దృష్టి సారించింది.
► ఇక ఎగుమతుల వృద్ధిపై కేంద్రం దృష్టి కనీస ఎగుమతి ధర రద్దు
న్యూఢిల్లీ: దేశంలో ఉల్లి టోకు ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో... ఇక వీటి ఎగుమతుల పెంపుపై కేంద్రం దృష్టి సారించింది. ఈ మేరకు కేంద్రం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస ఎగుమతి ధరను (ఎంఈపీ) పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. దేశంలో ఉల్లి ధరలు త్రీవంగా ఉన్న సమయంలో కనీస ఎగుమతి ధరను ‘అధిక స్థాయిలో’ కేంద్రం నిర్ణయిస్తుంది.
ఆ స్ధాయి ధర రాకుంటే... ఎగుమతులు చేయడం సాధ్యపడదు. దీనివల్ల దేశంలో సరఫరా పెరిగి ఉల్లి ధర దిగిరావాలన్నది లక్ష్యం. దేశంలో ఉల్లి ధర తీవ్రంగా ఉన్న ఆగస్టులో ఎంఈపీని టన్నుకు కేంద్రం 425 డాలర్ల నుంచి 700 డాలర్లకు పెంచింది. దేశంలో సరఫరాలు పెరగడంతో ఈ నెలారంభంలో తిరిగి 400 డాలర్లకు తగ్గించింది. తాజాగా ఎంఈపీని పూర్తిగా ఎత్తివేసింది. కేజీ హోల్‌సేల్ ధర రూ. 10కి పడిపోయిన నేపథ్యంలో ఎంఈపీని పూర్తిగా ఎత్తివేయాలని ఉల్లి ఉత్పత్తి అధికంగా ఉండే మహారాష్ట్ర కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.