మూడు నెలల కనిష్టానికి పసిడి
ముంబై : బంగారం ఇక్కడ ప్రధాన బులియన్ మార్కెట్‌లో బుధవారం 3 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. మంగళవారం ముగింపుతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.155 తగ్గి రూ.26,100కు చేరింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర అదే స్థాయిలో తగ్గి రూ.25,950కి పడింది. వెండి కూడా భారీగా రూ.1,130 తగ్గి రూ.35,115కు జారింది.
కారణాలు : అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకుల ధోరణి నేపథ్యంలో స్టాకిస్టులు, ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు స్పాట్ మార్కెట్‌లో పసిడి నష్టాలకు కారణమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పరిశ్రమల నుంచి డిమాండ్ తగ్గడం పసిడి ధరపై ప్రతికూలత చూపుతోందనీ విశ్లేషిస్తున్నాయి. చైనా వృద్ధిపై అనుమానాలు.. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు... ఈ నేపథ్యంలో డాలర్ బలపడ్డం వంటి అంశాలు విలువైన మెటల్స్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ధర ఔన్స్‌కు (31.1 గ్రా) 1,160 డాలర్ల స్థాయిలో తిరుగుతుండగా, వెండి విషయంలో ఈ రేటు 15 డాలర్లుగా ఉంది.