ముంబై వరదలు : మహింద్రా ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వరదలు ముంచెత్తాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన 288 మిల్లీమీటర్ల వర్షంతో ముంబై వీధులన్నీ అస్తవ్యస్తమయ్యాయి. 1997 ఆగస్టు నుంచి ఇంత భారీ మొత్తంలో వర్షం కురియడం ఇదే మొదటిసారి. భారీ వరదలతో ఫుల్‌గా ట్రాఫిక్ జామ్, ఎక్కడి వాహనాలు అక్కడ ఇరక్కపోవడం, రైళ్ల రాకపోకలపై నిషేధం, విమానాలు రద్దు వంటి వాటితో పౌర వ్యవస్థ స్తంభించింది. అయినప్పటికీ ప్రజలు ఒక్కరికొక్కరు సాయపడుతూ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ఈ వరదలపై మహింద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహింద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ముంబై ప్రజల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని తెలుపుతూ బీబీసీ ఆర్టికల్కు కౌంటర్‌గా ఆనంద్ మహింద్రా ఈ ట్వీట్ చేశారు.
''హోస్టన్ వరదలు: దొంగతనాలు, చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తూ రాత్రంతా కర్ఫ్యూ విధించారు'' అని బీబీసీ ఓ ఆర్టికల్ రాసింది. ఆ ఆర్టికల్‌ను ఉద్దేశిస్తూ.. ఆనంద్ మహింద్రా ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో తన స్నేహితుడు ఒకరు ఎయిర్‌పోర్టుకు కారులో వెళ్తూ 5 గంటల పాటు వరదల్లో చిక్కుకుపోయారని, మురికివాడకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడిని బయటికి తీసుకొచ్చి టీ, బిస్కెట్లు అందించినట్టు మహింద్రా ట్వీట్ చేశారు. భారత్‌లో మానవత్వం బతికే ఉందని తెలుపుతూ మహింద్రా చేసిన ఈ ట్వీట్‌కు ట్విట్టరియన్ల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.
ఒక్కరి కోసం అన్ని మతాల తలుపులు తెరుచుకుంటాయని, ఇదే భారత్ అంటూ ఓ ట్విట్టర్ పేర్కొన్నారు. అంతేకాక ప్రతికూల పరిస్థితుల్లో ఒకరికి మరొకరు తోడుగా నిలుస్తారని, ఎలాంటి దొంగతనాలు, చొరబాట్లు ఇక్కడ ఉండవన్నారు. భారత్‌లో మంచి ప్రజలున్నారని, కానీ సిస్టమే సరిగా లేదని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. ఇలా ఆనంద్ మహింద్రా ట్వీట్‌కు ప్రతిస్పందనగా చాలామంది ట్వీట్లు చేశారు.