
అమెరికా శ్రీమంతుల్లో ముగ్గురు ఎన్నారైలు
అమెరికా శ్రీమంతుల జాబితాలో ముగ్గురు ప్రవాస భారతీయులు చోటు దక్కించుకున్నారు. అమెరికాలో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను 'ఫోర్బ్స్' ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 72 బిలియన్ డాలర్ల సంపదతో వరుసగా 12వ ఏడాది ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. గతేడాది పోలిస్తే ఆయన సంపద 6 బిలియన్ డాలర్లు పెరిగింది.
ఇండియన్ అమెరికన్, ఎఎంపీ అండ్ ఎఎంపీ కంపెనీ అధినేత భారత్ దేశాయ్ 2.2 బిలియన్ డాలర్ల సంపదతో 252 స్థానంలో నిలిచారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న రొమేష్ టీ వద్వానీ 2.1 బిలయన్ డాలర్ల ఆస్తులతో తర్వాత స్థానంలో ఉన్నారు. కాలిఫోర్నియా వెంటర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 352 స్థానంలో నిలిచారు. ఆయన సంపద 1.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ లెక్కగట్టింది.
ఇన్వెస్టర్ వారెన్ బఫెట్(58.5 బిలియన్ డాలర్లు), ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్(41 బిలియన్ డాలర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. గతేడాది 36వ స్థానానికి పడిపోయిన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్(19 బిలియన్ డాలర్లు) 20వ స్థానానికి ఎగబాకారు.