వాయిదాలపై విమాన టికెట్లు..
♦ స్పైస్‌జెట్ పోస్ట్-పెయిడ్ ఆఫర్
♦ అతి తక్కువగా 12-14% వడ్డీ రేటు
న్యూఢిల్లీ : చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా పోస్ట్-పెయిడ్ స్కీము కింద టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ కింద నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) విధానంలో టికెట్స్ తీసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వాటికి అత్యంత తక్కువగా 12-14 శాతం వడ్డీ రేటు ఉంటుందని పేర్కొంది. ఇతరత్రా క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐల విధానంలో తీసుకునే వాటితో పోలిస్తే వడ్డీ వ్యయం దాదాపు 70 శాతం తక్కువగా ఉంటుందని స్పైస్‌జెట్ వివరించింది.
యాక్సిస్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లు ఈ స్కీమును ఉపయోగించుకోవచ్చని స్పైస్‌జెట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దేవజో మహర్షి తెలిపారు. త్వరలో ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ ఆఫర్ కింద టికెట్లు తీసుకునే వారు 3 నుంచి 12 నెలల కాలం పాటు చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని వివరించారు. అయితే, స్పైస్‌జెట్ వెబ్‌సైట్ ద్వారా చేసే బుకింగ్స్‌కి మాత్రమే ఇది వర్తిస్తుంది.