కీలక పరిశ్రమలు హ్యాపీ
నవంబర్‌లో 6.7% వృద్ధి
⇒ ఐదు నెలల గరిష్టం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ నవంబర్‌లో మంచి పనితీరును కనబరిచింది. వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. 2013 నవంబర్‌లో ఈ రేటు 3.2 శాతం. బొగ్గు, రిఫైనరీ ప్రొడక్టులు, విద్యుత్, సిమెంట్ రంగాల మంచి పురోగతి- మొత్తం పరిశ్రమల గ్రూప్ చక్కటి వృద్ధికి కారణమైంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన ద్రవ్య, పరపతి సమీక్ష, విధాన ప్రకటనకు పరిగణనలోకి తీసుకునే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వాటా (వెయిటేజ్) 38 శాతం. జనవరి రెండవ వారం చివర్లో ఐఐపీ నవంబర్ గణాంకాలు వెలువడతాయి. తాజాగా విడుదలైన గణాంకాలకు సంబంధించి 2013 నవంబర్‌లో చోటుచేసుకున్న వృద్ధి రేటుతో పోల్చి 2014 నవంబర్‌లో వృద్ధి రేటును పరిశీలిస్తే...
ప్లస్...
బొగ్గు: వృద్ధి రేటు 3.3 శాతం నుంచి 14.5 శాతానికి ఎగసింది.
రిఫైనరీ ప్రొడక్టులు: క్షీణత రేటు వృద్ధి బాటలోకి మారింది. ఈ రేటు -5.2 శాతం నుంచి 8.1 శాతానికి ఎగసింది.
విద్యుత్: చక్కటి పనితీరుతో ఉత్పత్తి వృద్ధి 6.3 శాతం నుంచి 10.2 శాతానికి చేరింది.
సిమెంట్: ఈ రంగంలో వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 11.3 శాతానికి ఎగసింది.
స్టీల్: వృద్ధి రేటు 10.1 శాతం నుంచి 1.3 శాతానికి పడింది.
మైనస్...
క్రూడ్ ఆయిల్: ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (మైనస్)లోకి జారింది. ఈ క్షీణ రేటు -0.1 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో ఈ రేటు 1.2 శాతం.
సహజ వాయువు: క్షీణ రేటు కొనసాగుతోంది. అయితే ఈ రేటు -11.2 శాతం నుంచి -2.9 శాతానికి తగ్గడమే కొంచెం ఊరట.
ఎరువులు: వృద్ధి రేటు (0.6 శాతం) క్షీణతలోకి జారింది. ఇది -2.8 శాతంగా నమోదయింది.
ఎనిమిది నెలల్లో...
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15, ఏప్రిల్-నవంబర్) ఎనిమిది నెలల కాలంలో 2013-14 ఇదే కాలంతో పోల్చిచూస్తే- ఎనిమిది పరిశ్రమల గ్రూప్ రేటు 4.1 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది.