ఏపీలో ఐటీ రంగానికి తోడ్పాటు | to contribution IT sector in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో ఐటీ రంగానికి తోడ్పాటు

Published Tue, Sep 30 2014 12:55 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

to contribution IT sector in AP

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు తమవంతు సహకారం అందిస్తామని పలువురు ఐటీ రంగ ప్రముఖులు ప్రకటించారు. ఐటీ కంపెనీల సీఈవోలలో విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన సదస్సులో రాష్ట్రాన్ని డిజిటలైజ్ చేయడానికి గూగుల్ సంస్థ సహకారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. విప్రో(రూ.150కోట్లు), టెక్ మహీంద్ర (రూ.250కోట్లు), సమీర్(రూ.80కోట్లు), టెస్సాల్వ్( రూ.250కోట్లు)  పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఆయా సంస్థల తరపున వాటి ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 16 సంస్థలకు విశాఖపట్నం, విజయవాడలలో కంపెనీలు ప్రారంభించేందుకు వీలుగా భూ కేటాయింపులు, ఇంక్యుబేషన్ సెంటర్‌లో స్థలాలు కేటాయించింది. ఈ సందర్భంగా  ఐటీ రంగ ప్రముఖులు పలువురు తమ అభిప్రాయాలను ఇలా వెల్లడించారు.

 గ్రామీణ ప్రాంతాల నుంచి నిపుణులు రావాలి
 గ్రామీణ ప్రాంతాల నుంచి ఐటీ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలను రూపొందించాలి. స్టార్ట్ అప్ విలేజ్‌లు ఒక అద్భుత ప్రయోగం. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే విశాఖపట్నంతోపాటు ఏపీ అభివృద్ధి పథంలో సాగుతుంది. - క్రిష్ గోపాలకృష్ణన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు

 ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవాలి
మన యువత ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూడకుండా ఉపాధి అవకాశాలు కల్పించేస్థాయికి చేరుకోవాలి. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు పాఠ్యాంశాలలో మార్పులు అవసరం. ఐటీ రంగంలో రాష్ట్రం వృద్ధికి కాస్మోపాలిటన్ నగరంగా ఉన్న విశాఖ మెట్రోపాలిటన్ నగరంగా ఎదగాలి. - బీవీ మోహన్‌రెడ్డి, నాస్కామ్ ఉపాధ్యక్షుడు

 ప్రపంచస్థాయి స్టార్ట్ అప్ ఎకోసిస్టమ్
 ఇంక్యుబేటర్ విధానం ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడింది. కేరళలో విజయవంతమైన ఈ విధానాన్ని విశాఖపట్నం కేంద్రంగా ఏపీలో అమలు చేస్తాం. స్టార్ట్ అప్ విలేజ్ విధానంతో విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.
 - సంజయ్ విజయ్‌కుమార్, సీఈవో, మోబ్‌మీ
 
ఏపీ డిజిటలైజ్‌కు కార్యాచరణ
ఏపీనీ డిజిటలైన్ చేసేందుకు 4 ప్రధాన అంశాలతో కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం. మొదటగా ఇంటర్‌నెట్ సేవలను తెలుగులో అందుబాటులోకి తెస్తాం. ఈ ప్రక్రియలో తెలుగు పత్రికలు, మ్యాగజైన్లను భాగస్వాములుగా చేసుకుంటాం. 2. చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ఆన్‌లైన్  విధానంలోకి తీసుకువస్తాం. రానున్న రెండేళ్లలో లక్ష చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను ఆన్‌లైన్ విధానంలోకి తీసుకురావాలన్నది లక్ష్యం. 3. వినియోగదారులను ప్రత్యేకించి మహిళా వినియోగదారులను ఆన్‌లైన్ విధానంలోకి తీసుకువస్తాం.  4. అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఇతరవాటిని మోబైల్ డివైజస్‌లోకి అందుబాటులోకి తెస్తాం. - రాజన్ అనందన్, గూగుల్ సంస్థ ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement