రిఫండ్ తీసుకోవచ్చిలా.. | to take refund through Income Tax Department to filing returns | Sakshi
Sakshi News home page

రిఫండ్ తీసుకోవచ్చిలా..

Published Sun, May 4 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM

రిఫండ్ తీసుకోవచ్చిలా..

రిఫండ్ తీసుకోవచ్చిలా..

టీమ్ లీడర్‌గా సంజనకి ప్రమోషన్ రావడంతో ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరిగింది. తన టీమ్‌ను మొదటి స్థానంలో నిలబెట్టాలనే ఆలోచనలో తన సొంత పనులపై నిర్లక్ష్యం చూపించింది. దీంతో ఏప్రిల్ నెల జీతం సగానికి సగం తగ్గిపోయింది. అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లి అడిగితే టీడీఎస్ వల్ల జీతం తగ్గిందన్నారు. పిల్లలకు చెల్లించిన ట్యూషన్‌ఫీజులు, సేవింగ్స్ ఉన్నా.. వాటిని సకాలంలో ఆఫీసులో ఇవ్వకపోవడంతో టీడీఎస్‌కి గురయింది. మరి ఇప్పుడేం చెయ్యాలి అని ఆఫీసులో అడిగితే రిటర్నులు దాఖలు చేస్తే ఈ మొత్తం రిఫండ్ వస్తుందన్నారు. ఒక్క సంజనే కాదు చాలామంది సకాలంలో రశీదులు ఇవ్వక టీడీఎస్ బారినపడతారు. ఇలా అధికంగా పన్ను చెల్లించిన వారు రిటర్నులు దాఖలు చేసుకోవడం ద్వారా ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రిఫండ్ ఎలా తీసుకోవాలన్న దానిపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ...
 
 గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం కంటే అధికంగా పన్నులు చెల్లించినవారు ఆందోళన చెందనవసరం లేదు. ఆదాయపు పన్ను శాఖకి రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వీటిని వెనక్కి తీసుకోవచ్చు. దీన్నే రిఫండ్‌గా వ్యవహరిస్తారు. మీరు రిటర్నులు దాఖలు చేస్తున్నప్పుడు దానిపైన రిఫండ్ అని తప్పనిసరిగా పేర్కొనాలి. అంతేకాదు... మీ బ్యాంకు అకౌంట్ నం బర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తదితర వివరాలన్నీ పేర్కొంటే రిఫండ్ నేరుగా మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది.

 ఒకవేళ రిటర్ను దాఖలు చేసినప్పుడు రిఫండ్ అని పేర్కొనకపోతే.. ఫాం 30ని ఉపయోగించి రిఫండ్ పొందవచ్చు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసిన తర్వాత మూడు నాలుగు నెలల్లో రిఫండ్ మొత్తం మీ ఖాతాలోకి వచ్చేస్తుంది. తొందరగా రిఫండ్ రావాలంటే... మీ సేవింగ్స్, పన్ను మినహాయింపులు లభించే వివరాలను పూర్తిగా పేర్కొని ఆన్‌లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేయండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో మీ రిఫండ్ స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఒకవేళ రిఫండ్ ఆలస్యమైతే.. మీ అసెస్‌మెంట్ ఆఫీసర్‌ను సంప్రదించొచ్చు.. లేదా ఇన్‌కమ్‌ట్యాక్స్ అంబుడ్స్‌మెన్‌కి ఫిర్యాదు చేయొచ్చు.

 టీడీఎస్ అంటే
 ఆదాయం కంటే అధికంగా పన్ను చెల్లించే వారిలో అత్యధికంగా ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు ఉంటారు. వీరంతా టీడీఎస్ రూపంలో ఎప్పటికప్పుడు పన్ను చెల్లించేస్తుంటారు. దీన్నే మూలం వద్ద పన్ను (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్-టీడీఎస్) అంటారు. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చిన ఉద్యోగులు ప్రతి నెలా టీడీఎస్ రూపంలో ముందస్తుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకి రూ.24,000 పన్ను చెల్లించాల్సి ఉంటే ఈ మొత్తం ఒకేసారి కాకుండా ప్రతి నెలా రూ.2,000 చొప్పున టీడీఎస్ రూపంలో జీతంలోంచి కోత పెడుతుంటారు. అలాగే చాలా వ్యాపారాలు, కమీషన్ ఆదాయం ఉన్న వాళ్ళు తప్పని సరిగా 10 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

 ఎందుకు ఎక్కువ పన్ను కోస్తారు?
 ఆదాయ పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి సేవింగ్స్, వ్యయాల రూపంలో అనేక అవకాశాలున్నాయి. వీటి వివరాలన్నీ ప్రతి ఏడాది ముందుగానే మనం పనిచేస్తున్న ఆఫీసులో ఇవ్వాలి. వీటిని పరిగణనలోకి తీసుకొని ఆదాయపు పన్ను లెక్కించి ఆ మేరకు టీడీఎస్‌ను నిర్ణయిస్తారు. ఒకవేళ పని ఒత్తిడిలో పడి, లేక వీలుకాక సేవింగ్స్ వివరాలు ఇవ్వకపోతే ఆఫీసు వాళ్లు ఎక్కువ టీడీఎస్‌ను విధిస్తారు. అలాగే బ్యాంకులో వడ్డీ ఆదాయం ఏడాదికి రూ.10,000 దాటితే టీడీఎస్ వర్తిస్తుంది. మీరు పన్ను పరిధిలోకి రాకున్నా ఇలా టీడీఎస్ చెల్లించాల్సిందే. ఈ మొత్తాన్ని తర్వాత రిటర్నులు దాఖలు చేసి రిఫండ్ తీసుకోవాలి. అధికంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లిం చినవారు, వ్యాపారంలో నష్టం వచ్చిన వారు ఆ వివరాలను దాఖలు చేయ డం ద్వారా అధికంగా చెల్లించిన పన్నుని వెనక్కి తీసుకోవచ్చు.            
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
 ఈ-ఫైలింగ్
 ఆన్‌లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేయవచ్చు. నేరుగా యూజర్ ఐడీ క్రియేట్ చేసుకోవడం ద్వారా రిటర్నులు దాఖలు చేయొచ్చు. https://incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ను దర్శించి మీకు సంబంధించిన ఐటీఆర్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఇందులో మీ ఆదాయ వివరాలు, సేవింగ్స్, టీడీఎస్, పన్ను చెల్లింపులు తదితర వివరాలన్నీ పూర్తి చేయండి. అలాగే బ్యాంకు అకౌంట్ వివరాలను ఇవ్వడం మర్చిపోవద్దు. వివరాలన్నీ ఇచ్చిన తర్వాత  ఎక్స్‌ఎంఎల్ ఫైల్‌ను జనరేట్ చేయండి. ఈ ఫైల్‌ను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఐటీఆర్-వి ఫామ్‌ను ప్రింట్ తీసుకొని బెంగళూరులోని కేంద్ర ఆఫీసుకు 120 రోజుల్లోగా అందేటట్లు పంపించండి.

 ఏ ఫారం ఎవరికి
 ఐటీఆర్1    : జీతం, వడ్డీ, కుటుంబ పెన్షన్ ఆదాయం  ఉన్న వారికి
 ఐటీఆర్ 2    : మూలధన లాభాలు, ఇంటి అద్దె ఆదా  యంగా ఉన్న వారికి ఇది. ఈ ఆదాయా  లతో పాటు జీతం కూడా ఉన్నా ఇదే.                    హిందూ అవిభక్త కుటుంబానికీ ఇదే.
 ఐటీఆర్ 3    : భాగస్వామ్య వ్యాపారస్తులకు
 ఐటీఆర్ 4    : వృత్తినిపుణులు, వ్యాపారస్తులకు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement