పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్)కు జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరైన అవగాహన లేకుండా, నిపుణుల సలహాలు తీసుకోకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం కొంచెం కష్టమని పన్ను చెల్లింపుదారులు భావిస్తుంటారు. ఐటీఆర్ గడువు ముగుస్తుంటే కంగారుపడి ఆన్‌లైన్‌లో నమోదుచేసేపుడు ఒక్కోసారి పొరపాట్లు చేస్తారు. అలాచేసే తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉందని గుర్తించాలి. రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేయడం ద్వారా వాటిని సవరించుకోవచ్చు. కానీ, అందుకు అదనంగా సమయం కేటాయించాలి. అది కొంత చికాకు పెట్టే అంశం. అందుకే తొలిసారి ఐటీఆర్ ఫైల్ చేసినపుడే జాగ్రత్త వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ తరుణంలో రిటర్నులు దాఖలు చేసేటప్పుడు బ్యాంకు ఖాతా ధ్రువీకరణ, ఈ-వెరిఫై, మినహాయింపులు..వంటి కొన్ని అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్యాంకు అకౌంట్ ధ్రువీకరణ
పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలుకు ముందే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ బ్యాంకు ఖాతాలను ధ్రువీకరించుకోవాలి. ట్యాక్స్ పేయర్ల ఖాతా యాక్టివ్‌గానే ఉందని ఇది నిర్ధరిస్తుంది. అప్పుడే రిఫండ్లు జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.
ఈ-వెరిఫై
ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత దాన్ని పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా ధ్రువీకరించాలి. అప్పుడే దాఖలు ప్రక్రియ పూర్తయినట్లు. లేదంటే రిటర్నులను పరిగణనలోకి తీసుకోరు. ఐటీఆర్ అప్‌లోడ్ చేసిన 30 రోజుల్లోగా దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేసి తప్పకుండా వెరిఫై చేయాలి.
మినహాయింపులు ఇలా..
ఆదాయపు పన్ను మినహాయింపుల్లో భాగంగా సెక్షన్ 80సీ నిబంధనల ప్రకారం వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసి, రూ.1,50,000 వరకూ వెసులుబాటు పొందవచ్చు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్, హోమ్‌లోన్ అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం తదితరాలన్నీ ఈ సెక్షన్ పరిధిలోకే వస్తాయి. సెక్షన్ 80డీలో ఆరోగ్య బీమా ప్రీమియం వివరాలు నమోదు చేయాలి. సేవింగ్స్ ఖాతా ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకు 80టీటీఏ కింద మినహాయింపు కోరవచ్చు. అలాగే వేతనంలో హెచ్‌ఆర్‌ఏ లేనట్లయితే అద్దె చెల్లింపులకు 80జీజీ కింద మినహాయింపు ఉంటుంది.
ఆదాయాలన్నీ చెప్పాల్సిందే..
చాలామంది పన్ను చెల్లింపుదారులు అదనపు మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించరు. వడ్డీ, కమిషన్ వంటి వాటినుంచి వచ్చే ఇన్‌కమ్‌ను వదిలేస్తుంటారు. వీటన్నింటిపై టీడీఎస్ కట్ చేసి ఉంటారనే ఉద్దేశంతో అవసరం లేదనుకుంటారు. కానీ, ఐటీఆర్‌లో ప్రతీ ఆదాయ మార్గాన్ని పేర్కొనాల్సిందే.
గడువు పూర్తయితే..
ఐటీఆర్ ఫైలింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలి. లేదంటే రూ.1,000 నుంచి రూ.5,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ రిటర్నులు దాఖలు చేయాలి.
ఇదీ చదవండి: ఉద్యోగులకు ఈ ఫారం తప్పనిసరి!
అన్ని పత్రాల పరిశీలన
కొన్నిసార్లు ఇన్‌కమ్‌ట్యాక్స్ వివరాలు, ఫారం-16లోని వివరాలు ఒకేలా ఉండకపోవచ్చు. మీ వద్ద వసూలు చేసిన పన్నును ఆదాయపు పన్ను విభాగానికి జమ చేయకపోవడం వల్ల ఈ వ్యత్యాసం కనిపిస్తుంది. రిటర్నులు దాఖలు చేసేముందు మీ ఫారం-16, ఫారం 16ఏ, 26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లను పూర్తిగా పరిశీలించాలి. ఏదైనా తేడా ఉంటే మీరు పనిచేసే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, సరిచేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment