ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) గతంలో ప్రకటించిన రూ. 20 వేల విత్‌డ్రా లిమిట్ రేపు అనగా అక్టోబర్ 31 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. దీనివల్ల దాదాపు 1. 42 కోట్ల మంది ఎస్‌బీఐ వినియోగదార్ల మీద ఈ ప్రభావం పడనుంది. ఎస్‌బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఎస్‌బీఐ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసే నగదును సగానికి కోత పెట్టి కేవలం రూ.20 వేలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ పరిమితి 40వేల రూపాయలుగా ఉండేది.
అయితే ఇక మీదట రూ. 20 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకునేవారు హై వెరియంట్ డెబిట్ కార్డ్‌కు అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి బ్యాంక్ అధికారులు ‘అత్యధిక మంది రోజుకు రూ.20 వేలు మించి తీయడం లేదని మా పరిశీలనలో తేలింది. అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం కొందరు వ్యాపారులు మాత్రం రూ.40,000 వరకు నగదును ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేస్తున్నారు. దీనివల్ల ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు పెరుగుతున్నాయి. దాంతో పాటు నగదురహిత/ డిజిటల్ లావాదేవీలు పెంచడమే ధ్యేయంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని’ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment