
ఉచిత ఆఫర్లను నిరోధించండి
♦ జియో ఆఫర్ల వల్లే టెలికం రంగానికి కష్టాలు
♦ టెర్మినేట్ కాల్ చార్జీలు పెంచాలి
♦ ఐఎంజీకి మూడు టెలికం కంపెనీల నివేదన
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు వ్యతిరేకంగా మరోసారి టెలికం కంపెనీలు గళం విప్పాయి. ఎయిర్‌టెల్‌తో పాటు, వొడాఫోన్, ఐడియా సెల్యులర్ కంపెనీలు అంతర మంత్రిత్వ శాఖ(ఐఎంజీ–ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్)తో విడివిడిగా సమావేశమయ్యాయి. ఈ సమావేశాల్లో రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల వల్లే టెలికం రంగం తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిందని ఈ కంపెనీలు పేర్కొన్నాయి. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలను, జీఎస్‌టీని తగ్గించాలని ఈ మూడు టెలికం కంపెనీలు ముక్తకంఠంతో కోరాయి. . కాల్ కనెక్ట్ చార్జీలు(ఐయూసీ–ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జీ) ప్రస్తుతం నిమిషానికి 14 పైసలుగా ఉందని, ఇది వ్యయం కంటే తక్కువని, దీనిని సవరించాల్సి ఉందని, దీంతో పాటు మరికొన్ని సూచనలను ఈ కంపెనీలు చేశాయి. వివరాలు....
కాల్ టెర్మినేట్ చార్జీలు పెంచాలి..
రిలయన్స్ జియో అనుచిత రీతిలో టెలికం టారిఫ్‌లను నిర్ణయిస్తోందని భారతీ ఎయిర్‌టెల్ విమర్శించింది. టెలికం కంపెనీల నెట్‌వర్క్‌ల్లో టెర్మినేట్ అయ్యే కాల్స్ చార్జీలను పెంచాలని కూడా డిమాండ్ చేసింది. టెర్మినెట్ అయ్యే కాల్స్‌కు ఎంత మొత్తం వ్యయం అవుతుందో అంత మొత్తాన్ని ఇతర టెలికం కంపెనీలు చెల్లించేలా చూడాలని సూచించింది.
ఫ్లోర్‌ప్రైస్ నిర్ణయించాలి...
ఐయూసీను సవరిస్తే, అనుచిత రీతిలో టెలికం టారిఫ్‌లను ఆఫర్ చేయడం నిరోధించడం కుదురుతుందని ఐడియా సెల్యులర్ పేర్కొంది. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా టెలికం పరిశ్రమ బాగా దెబ్బతిన్నదని, వాయిస్, డేటా టారిఫ్‌లకు ఫ్లోర్‌ప్రైస్(కనీస ధర)లను నిర్ణయించడం వల్ల అనుచిత రీతిలో ఆఫర్లను అందించడాన్ని నిరోధించవచ్చని సూచించింది. టెలికం రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన– ఐఎంజీ టెలికం కంపెనీలతో ఈ వారమంతా చర్చలు జరుపుతూనే ఉంది.
జియోపై ఫిర్యాదును కొట్టేసిన సీసీఐ
మరోవైపు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తాజాగా మరొకసారి జియోపై వచ్చిన ఫిర్యాదును తోసిపుచ్చింది. ఈ ఫిర్యాదు ప్రధానంగా ఉచిత సేవలకు సంబంధించింది. జియో ఆఫర్లలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన లేదని పేర్కొంది. కాగా సీసీఐ.. జియోపై వచ్చిన ఫిర్యాదులను తిరస్కరించడం ఇది రెండోసారి. ఇది ఇదివరకు ఎయిర్‌టెల్ చేసిన ఫిర్యాదును జూన్ 9న తోసిపుచ్చింది.