టార్క్ మోటార్స్ నుంచిఎలక్ట్రిక్ బైక్ ‘టీ6ఎక్స్’
ధర రూ.1.25 లక్షలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ తయారీ కంపెనీ ‘టార్క్ మోటార్స్’ తాజాగా తన తొలి మోడల్ ‘టీ6ఎక్స్’ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1.25 లక్షలు. లిథియమ్ అయాన్ బ్యాటరీస్‌తో నడిచే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లుగా ఉంది. అలాగే బైక్‌ను ఒకసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. బైక్ ఫుల్ చార్జ్‌కు రెండు గంటల సమయం, 80 శాతం చార్జ్‌కు ఒక గంట సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.
ఇక బ్యాటరీ లైఫ్ 80,000-1,00,000 కిలోమీటర్లు వస్తుందని తెలిపింది. లిథియమ్ అయాన్ బ్యాటరీస్ ధర తగ్గడం (గత మూడేళ్లలో 50 శాతం తగ్గింది) తమను బాగా ఆకర్షించిందని, ఆ మేర కు తాజా బైక్‌ను అందుబాటు ధరల్లో మార్కెట్‌లోకి తీసుకువచ్చామని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో ఏడాదికి 5,000-10,000 యూనిట్ల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపింది. ఈ బైక్స్‌ను తొలిగా ఢిల్లీ, పుణే, బెంగళూరు ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో బైక్స్ అనువైన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది.