టోరెంట్ ఫార్మా చేతికి గ్లోకెమ్ ప్లాంటు | Torrent Pharma to buy Glochem manufacturing unit | Sakshi
Sakshi News home page

టోరెంట్ ఫార్మా చేతికి గ్లోకెమ్ ప్లాంటు

Published Fri, Jul 1 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

టోరెంట్ ఫార్మా చేతికి గ్లోకెమ్ ప్లాంటు

టోరెంట్ ఫార్మా చేతికి గ్లోకెమ్ ప్లాంటు

వైజాగ్ ప్లాంటు కొనుగోలుకు ఒప్పందం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం టోరెంట్ ఫార్మా తాజాగా గ్లోకెమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన వైజాగ్ ప్లాంటును, కొన్ని డ్రగ్ మాస్టర్ ఫైల్స్ (డీఎంఎఫ్)ను ఏకమొత్తంగా కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి గ్లోకెమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే గ్లోకెమ్.. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడిపదార్ధాలు (బల్క్ డ్రగ్స్ లేదా యాక్టివ్ ఇంగ్రీడియంట్స్-ఏపీఐ) ఉత్పత్తి చేస్తుంది. వైజాగ్‌లో పరవాడకు దగ్గర్లోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న ప్లాంటుకు ఎఫ్‌డీఏ, యూరోపియన్ ఔషధ రంగ నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులున్నాయి. ఇందులో నాలుగు బ్లాక్‌లు ఏపీఐల తయారీకి ఉపయోగపడుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ లేబరేటరీ, పైలట్ ప్లాంట్ తదితర సదుపాయాలున్నాయి. ప్లాంటులో అగ్నిప్రమాదం కారణంగా కొద్దిరోజుల క్రితమే వార్తల్లో నిల్చింది. ఇక డీల్ విలువను కంపెనీలు వెల్లడించనప్పటికీ .. సుమారు రూ. 300 కోట్ల మేర ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. 

 అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌కు అనుగుణంగా ఔషధాల ఉత్పత్తికి ఈ కొనుగోలు తమకు ఉపయోగపడగలదని టోరెంట్ ఫార్మా ఈడీ (ఆపరేషన్స్ విభాగం) జినేష్ షా తెలిపారు. వివిధ ఔషధాల ఉత్పత్తిలో ఉపయోగించే రసాయనాలు తదితర వివరాలతో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)కి తయారీ సంస్థలు సమర్పించే పత్రాలను డీఎంఎఫ్‌గా వ్యవహరిస్తారు. టోరెంట్ ఫార్మాకు 5 ఫార్ములేషన్ ప్లాంట్లున్నాయి. తాజాగా గ్లోకెమ్ వైజాగ్ కేంద్రాన్ని కొనుగోలు చేయడంతో ఏపీఐ ప్లాంట్ల సంఖ్య మూడుకు చేరుతుంది. హైదరాబాద్‌కే చెందిన ఇంజెక్టబుల్స్ తయారీ సంస్థ గ్లాండ్ ఫార్మా కొనుగోలుకు పోటీపడిన సంస్థల్లో టోరెంట్ కూడా ఉంది. అయితే, వాల్యుయేషన్ల వల్ల వైదొలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement