
అంతర్జాతీయంగా న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 22వ తేదీతో ముగిసిన వారంలో 11 డాలర్లు తగ్గి 1,271 డాలర్ల వద్ద ముగిసింది. వరుసగా 2 వారాల్లో 23 డాలర్లు పతనమైంది. ఒకదశలో పసిడి ఆరు నెలల కనిష్ట స్థాయి 1,264 డాలర్లను కూడా చూడ్డం గమనార్హం. డాలర్ ఇండెక్స్ 11 నెలల కనిష్ట స్థాయి 95.16ను తాకడం దీనికి నేపథ్యం. వారాంతానికి డాలర్ తిరిగి వారం వారీగా 71 సెంట్ల నష్టంతో 94.19కి తిరిగి వచ్చిన నేపథ్యంలో పసిడి కూడా కొంత కోలుకుని 1,271 డాలర్ల వద్ద వారంలో ముగిసింది. వాణిజ్య యుద్ధానికి సంబంధించి అమెరికా–చైనాల మధ్య తీవ్ర పరిస్థితులు ఈ వారంలోనే ఏర్పడ్డం ఇక్కడ కీలకాంశం. అయితే ఈ వాణిజ్య అనిశ్చితి పరిస్థితుల కన్నా, డాలర్ కదలికలపైనే పసిడి ఆధారపడినట్లు కనిపించింది. దీని ప్రకారం– డాలర్ ఇండెక్స్ తిరిగి బలోపేతమై 95 దాటితే పసిడి 1,250 డాలర్ల దిగువకు వచ్చే అవకాశం ఉందన్నది విశ్లేషణ. 1,280–1,270 డాలర్ల శ్రేణి మద్దతు స్థాయిని కోల్పోతే, మరింత అమ్మకాల ఒత్తిడితో పసిడి 1,240 డాలర్ల వరకూ పడే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం.
దేశంలో భారీ పతనం...
అంతర్జాతీయంగా పసిడి ధర పతనానికి తోడు, 22వ తేదీతో ముగిసిన వారంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడ్డ (0.61 పైసల లాభంతో 67.86 వద్ద ముగింపు) నేపథ్యంలో దేశీయంగా పసిడి ధర భారీగా పడింది. ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్ (ఎంసీఎక్స్)లో పసిడి 10 గ్రాముల ధర వారంలో రూ.400 తగ్గి రూ.30,610కి చేరింది. ఇక ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత గల పసిడి ధరలు వారంలో రూ.630 చొప్పున తగ్గి రూ.30,620, రూ.30,400 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర భారీగా రూ.1,780 లాభపడి రూ.39,735కు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment