ఐరాసలో అమెరికా-చైనా యుద్ధం
- ఉత్తరకొరియా అణుపరీక్షలపై దద్దరిల్లిన భద్రతా మండలి
- కిమ్ జోలికొస్తే ఊరుకోం: చైనా, రష్యా
- అతను యుద్ధాన్ని కోరుకుంటున్నాడు: అమెరికా
- భయంలేనివాడిని భరతం పట్టాల్సిందేనన్న నిక్కీ హేలీ
న్యూయార్క్: అణుబాంబులు, హైడ్రోజన్ బాంబుల పరీక్షలతో ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ‘ఉత్తరకొరియా ప్రయోగాల’పై ఐక్యరాజ్యసమితిలో అమెరికా-చైనాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ మాటలతో వినే రకం కాదని, యుద్ధాన్నే కోరుకుంటున్నాడని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు.
కాగా, అమెరికా వాదనను చైనా ప్రతినిధి లూజీ ఖండించారు. పరిస్థితి విషవలయంలా మారిందని, కిమ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు. సోమవారం నాటి భేటీతో కలుపుకొని మొత్తం 10 సార్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తరకొరియా అజెండాపై భేటీ అయింది. అమెరికా ఆంక్షలు ప్రతిపాదించిన అన్ని సందర్భాల్లోనూ ఆ తీర్మానాలను చైనా, రష్యాలు వీటో చేస్తూవస్తున్నాయి.
ఇక మాకు ఓపిక లేదు: ఉత్తరకొరియా అణుపరీక్షలు, వాటికి దన్నుగా నిలుస్తోన్న చైనాపై అమెరికా రాయబారి నిక్కీ హేలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కిమ్ జాంగ్ ఉన్ యుద్ధం కోసం యాచిస్తున్నారు(బెగ్గింగ్ ఫర్ వార్). ఐక్యరాజ్య సమితి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నే ఉన్నారు. ఇప్పటికే ఆరు సార్లు అణుపరీక్షలు చేశారు. ఇప్పటికైనా మనం ‘అతణ్ని దారికి తేవాలనే’ ఆలోచన వీడుదాం. తీవ్ర చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం తీసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి.. అమెరికాపైకి, అమెరికన్లపైకి కొన్ని వందల బాంబులు గురిపెట్టి కూర్చుంది కొరియా. ఇలాంటి పరిస్థిలో మేం సహనంతో ఉండలేం. యుద్ధం మా వాంఛకాదు. కానీ మా భద్రత విషయంలో ఎంత దూరమైనా వెళతాం’’ అని నిక్కీ హేలీ అన్నారు.
కొరియాపై యుద్ధాన్ని సహించం: అమెరికా వాదనను ఖండిస్తూ చైనా ప్రతినిధి లూజీ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితి విషవలయంలా మారింది. కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, అణువ్యాప్తి తగ్గింపు విషయంలో అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మేం ఉత్తరకొరియాను అభ్యర్థిస్తూనేఉన్నాం. అయితే, కొరియాను అణ్వాయుధాలు వదులుకోవాలని డిమాండ్ చేస్తోన్న అమెరికా తనకుతానుగా ఆ పని చేస్తోందా? అని ప్రశ్నించుకోవాలి. కొరియాపై ఆంక్షలను ఇంకా కఠినతరం చేయాలన్న ఆలోచననుగానీ, ఆ దేశంపై యుద్ధం చేయాలన్న ప్రణాళికలనుగానీ చైనా, రష్యాలు ముమ్మాటికీ సమర్థించబోవు. కొరియా ద్వీపంలో శాంతి నెలకొనాల్సిందే. అది జరగాలంటే ముందుగా అమెరికా, దాని అనుబంధ దేశం దక్షిణకొరియాలు వెనక్కితగ్గాలి. ఉత్తరకొరియాను చుట్టుముట్టి భయపెట్టిస్తున్న తీరును మార్చుకోవాలి. మీరు గట్టిపడేకొద్దీ వాళ్లూ గట్టిపడతారు’’ అని లూజీ అన్నారు.
వేరే దారి లేదు: ఐరాసా ఆంక్షలకు విరుద్ధంగా ఉత్తరకొరియాతో వాణిజ్యాన్ని సాగిస్తోన్న చైనా.. పరోక్షంగా కిమ్ తయారుచేస్తోన్న మిస్సైళ్లకు నిధులు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. కొరియా విషయంలో సాధ్యమైనన్ని శాంతియుత మార్గాలన్నీ విఫలమయ్యాయని, ఐరాస 10 సార్లు హెచ్చరించినా వారు వినిపించుకోవడం లేదని, కిమ్ లాంటి యుద్ధపిపాసిని అడ్డుకోవాలంటే తీవ్ర చర్యలకు ఉపక్రమించడం తప్ప వేరే దారి లేదని నిక్కీ హేలీ ముక్తాయింపునిచ్చారు.