అమెరికా– చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతుండగానే అమెరికా– భారత్ మధ్య సుంకాల పోరుకు తెరలేవడంతో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. భారత్‌కు వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రాధాన్యతలను అమెరికా తొలగించడం, దీనికి ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారత్ సుంకాలు విధించడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, నిఫ్టీ 11,700 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. నైరుతి రుతు పవనాల విస్తరణపై ఆందోళన నెలకొనడం, పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళికంగా ఉద్రిక్తతలు నెలకొనడం, ఫలితంగా ముడి చమురు ధరలు భగ్గుమంటుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మందగించడం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 491 పాయింట్లు పతనమై 38,961 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 11,672 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు నెల కనిష్ట స్థాయికి పడిపోయాయి. లోహ షేర్లు విలవిలలాడాయి. ఇంధన షేర్లు కూడా బాగా నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 541 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్ల మేర పతనమయ్యాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించింది.
మంగళవారం నుంచి మొదలై రెండు రోజుల పాటు జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక సమావేశం నేపథ్యంలో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో అప్రమత్తత నెలకొంది. ఇక మన దగ్గర సుంకాల పోరు కూడా జత కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మరింత ముదరడం, పశ్చిమాసియాలో అకస్మాత్తుగా రేగిన ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమనడంతో మన మార్కెట్ భారీగా నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుడు వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. ఈ వారంలో వెలువడే అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌ల నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారని, ఈ నిర్ణయాల ప్రభావం మార్కెట్‌పై ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
మరిన్ని విశేషాలు...
♦ టాటా స్టీల్ 5 శాతం పతనమై రూ.473 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
♦ సెన్సెక్స్‌లో 3 షేర్లు– యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఇన్ఫీ మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి.
♦ ఇక్రా రేటింగ్ సవరణ కారణంగా ఆస్టర్ డీఎమ్ హెల్త్‌కేర్ షేర్ 5 శాతం లాభపడింది.
♦ ఆర్‌నామ్‌లో వాటాను విక్రయించినప్పటికీ, రిలయన్స్ క్యాపిటల్ షేర్ 6.7% నష్టపోయి రూ.71.4 వద్దకు చేరింది.
♦ శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో పూర్తి వాటాను పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ విక్రయించింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ షేర్ 6 శాతం క్షీణించి రూ.1,018 వద్ద, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ 3 శాతం నష్టంతో రూ. 2,004 వద్ద ముగిశాయి.
♦ రిలయన్స్ ఇన్‌ఫ్రా కంపెనీకి సంబంధించిన వివిధ అంశాలపై ఆడిటర్లు సందేహాలు లెవనెత్తడంతో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్ ఇంట్రాడేలో 28 ఏళ్ల కనిష్ట స్థాయి, రూ.52.70కి పడిపోయింది. చివరకు 4.7 శాతం నష్టంతో రూ.56.5 వద్ద ముగిసింది.
♦ జెట్ ఎయిర్‌వేస్ వరుసగా పదకొండో రోజూ పతనమైంది. ఇంట్రాడేలో 16 శాతం క్షీణించి జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.66ను తాకిన ఈ షేర్ చివరకు 16.7 శాతం నష్టంతో రూ. 68.3 వద్ద ముగిసింది. ఒక్క జూన్ నెలలోనే ఈ షేర్ 53 శాతం నష్టపోయింది.
♦ దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బాష్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, సైయంట్, భారత్ ఫోర్జ్, బేయర్ క్రాప్‌సైన్స్, జేకే టైర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్‌ఫ్రా ఈ జాబితాలో ఉన్నాయి.
రూ.2 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,00,259 కోట్లు తగ్గి రూ.1,50,09,329 కోట్లకు తగ్గిపోయింది.
పతనానికి ప్రధాన కారణాలివీ...
♦ అమెరికాపై భారత్ సుంకాలు..
భారత్‌కు వాణిజ్యపరంగా ఉన్న కొన్ని ప్రాధాన్యతలను అమెరికా తొలగించింది. అంతే కాకుండా భారత ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, ధాన్యాలు, వాల్‌నట్ తదితర 28 రకాల వస్తువులపై సుంకాలు విధించింది. ఇప్పటికే చైనాతో సుంకాల పోరు సాగుతుండగా, తాజాగా భారత్‌తో కూడా వాణిజ్య యుద్ధం ఆరంభం కావడం, ఇది అంతర్జాతీయంగా ఇంకెంత దూరం పోతుందోనన్న ఆందోళన నెలకొనడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. భారత్ విధించిన సుంకాల కారణంగా మనకు 21 కోట్ల డాలర్ల అదనపు రాబడి రావచ్చన్న అంచనాలున్నప్పటికీ, ఇది ఇంతటితో ఆగదని, ఇరు దేశాల మధ్య మరింత సుంకాల పోరుకు, ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ప్రభావం ఉంటుందని ఆందోళన నెలకొంది.
♦ రుతుపవనాల విస్తరణపై ఆందోళన
వ్యవసాయం ప్రధానమైన మన దేశానికి నైరుతి రుతు పవనాలు కీలకం. ఈ నైరుతి రుతుపవనాలు ఇప్పటిదాకా జాడ లేకపోవడం, అరకొర వర్షాలే పడటం, ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
♦ పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత..
ఒమన్ సింధుశాఖలో రెండు ఆయిల్ ట్యాంకర్లపై దాడి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. చమురు ఉత్పత్తికి కీలకమైన ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొంటే, ముడి చమురు ధరలు భగ్గుమనే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముడి చమురు ధరలు పెరిగితే మన ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావమే పడుతుంది. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
♦ రూపాయి పతనం...
భారత్–అమెరికాల మధ్య సుంకాల పోరు ప్రారంభం కావడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోయింది. రూపాయి పతనం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది.
♦ తగ్గిన విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు
ఎన్నికల ఫలితాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్ మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఈ జోరు తగ్గింది. జూన్‌లో ఇప్పటివరకూ చూస్తే, (సోమవారం లావాదేవీలను కూడా పరిగణనలోకి తీసుకుంటే) విదేశీ ఇన్వెస్టర్లు రూ.411 కోట్ల నికర అమ్మకం దారులుగా నిలిచారు. విదేశీ ఇన్వెస్టర్ల జోరు తగ్గితే, స్వల్ప కాలంలో మార్కెట్ పరిమిత శ్రేణిలోనే కదలాడుతుందని నిపుణులంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment