కాల్ డ్రాప్స్ నిజమే...
ఆపరేటర్లకు నోటీసులు: ట్రాయ్
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ పరిమితికి మించి ఉన్నందున ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్టు ట్రాయ్ తెలిపింది. ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ సోమవారం ఢిల్లీలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. తాము కాల్స్ డేటాను పరిశీలించామని, సేవల నాణ్యత నిబంధనల(క్యూఓఎస్) ప్రకారం కాల్ డ్రాప్స్ అనుమతించినదాని కంటే చాలా అధికంగా ఉన్నట్టు తేలిందన్నారు. దీన్ని బట్టి ఇంటర్‌కనెక్షన్‌కు సంబంధించిన లెసైన్స్ నిబంధనలను, క్యూఓఎస్ నిబంధలను ఆపరేటర్లు పాటించలేదని తెలుస్తోందన్నారు.
తమ నెట్‌వర్క్ నుంచి వెళ్లే కాల్స్‌కు సరిపడా ఇంటర్ కనెక్షన్ పాయింట్లు సమకూర్చలేదంటూ ప్రధాన టెలికం ఆపరేటర్లపై జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 80 శాతం వరకు కాల్స్ ఫెయిల్ ఘటనలు చోటు చేసుకున్నాయని, 10 రోజుల వ్యవధిలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా నెట్‌వర్క్‌లకు వెళ్లిన 52 కోట్ల కాల్స్ ఫెయిలైనట్టు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు కాల్స్ వివరాలను ట్రాయ్ తెప్పించుకుని పరిశీలించింది. నిబంధనల ఉల్లంఘన తేలడంతో షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు ట్రాయ్ చైర్మన్ శర్మ తెలిపారు.