
జీవితంలో రిస్క్ తీసుకోండి
నిరాశావాదులు, ప్రతికూల భావనలతో ఉండే వారి మాట వినొద్దని విద్యార్థులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సూచించారు.
అహ్మదాబాద్: నిరాశావాదులు, ప్రతికూల భావనలతో ఉండే వారి మాట వినొద్దని విద్యార్థులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సూచించారు. జీవితంలో కొన్ని రిస్క్‌లు తీసుకోవాలని, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఆశావాదమనే మెలోడీలతో చెవులను నింపుకొని, మీ సొంత సంగీతానికి తగ్గట్లుగా డ్యాన్స్ చేయాలని చెప్పారు. ఇక్కడి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పెట్రోలియమ్ యూనివర్సిటీ(పీడీపీయూ) నాలుగవ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
రిస్క్ తీసుకున్నవాళ్లే చరిత్ర సృష్టించారని, కోట్లాది ప్రజల జీవితాలను మార్చేశారని పీడీపీయూకు ప్రెసిడెంట్‌గా కూడా పనిచేస్తున్న ఆయన వివరించారు. గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాపారంలో ఇంధన పరిశ్రమ కీలకంగా ఉందని, భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల పరిష్కారంలో ఇతరుల కంటే పీడీపీయూ విద్యార్ధులు సమర్థవంతంగా వ్యవహరించగలరని పేర్కొన్నారు. పెట్రోలియం వంటి శిలాజ ఇంధనాల నుంచి భారత్‌ను నవీకరణ ఇంధన వనరుల దిశగా నడిపించేలా నవ కల్పనలను రూపొందించాలని ఆయన విద్యార్ధులకు పిలుపునిచ్చారు.