టీవీఎస్.. స్టార్‌సిటీ ప్లస్
చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా స్టార్ సిటీ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఇది స్టార్ సిటీకి అప్‌గ్రేడెడ్ వేరియంట్. దీని ధర రూ. 44,000 (ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర). 110 సీసీ ఇంజిన్ సామర్ధ్యం ఉండే స్టార్ సిటీ ప్లస్.. లీటరుకు 86 కిలోమీటర్ల మైలేజి ఇవ్వగలదని కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు. ఈ ఏడాది ప్రవేశపెట్టదల్చుకున్న వాహనాల్లో ఇది మొదటిదని, మరో నాలుగు నెలల్లో అప్‌గ్రేడెడ్ ఇంజిన్‌తో విక్టర్‌ను వాహనాన్ని రీలాంచ్ చేస్తామని ఆయన వివరించారు. ఇకపై ప్రతి త్రైమాసికంలోనూ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు, వచ్చే నెల స్కూటీ జెస్ట్‌ను ఆవిష్కరించనున్నట్లు వేణు వివరించారు.
ప్రస్తుతం ఎంట్రీ లెవెల్‌లో స్టార్ సిటీ, స్పోర్ట్.. 125 సీసీ విభాగంలో ఫీనిక్స్, అటు పైన హై ఎండ్‌లో అపాచీ ఆర్‌టీఆర్ బైక్‌లను టీవీఎస్ విక్రయిస్తోంది. అలాగే జూపిటర్, వెగో, స్కూటీ స్ట్రీక్, స్కూటీ పెప్‌ప్లస్ పేరిట స్కూటరెట్లను.. టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్, ఎక్స్‌ఎల్ హెవీ డ్యూటీ పేరిట మోపెడ్లను, టీవీఎస్ కింగ్ పేరుతో ఆటో రిక్షాలను విక్రయిస్తోంది. ప్రస్తుతమున్న స్టార్ సిటీ మోడల్‌ను దశలవారీగా నిలిపివేస్తామని టీవీఎస్ మోటార్ ప్రెసిడెంట్ కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు.
బీఎండబ్ల్యూ మోటోర్యాడ్ బైక్...
జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం బీఎం డబ్ల్యూ.. మోటార్‌సైకిల్ విభాగం మోటోర్యాడ్‌తో ఒప్పందంలో భాగంగా తొలి వాహనాన్ని రూపొందిస్తున్నామని వేణు వివరించారు. ఇది వచ్చే ఏడాది ద్వితీ యార్థం నాటికి సిద్ధం కాగలదని ఆయన పేర్కొన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఇందుకు సంబంధించి ఇరు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీని ప్రకారం టీవీఎస్ రూ. 142 కోట్లు ఇన్వెస్ట్ చే స్తుండగా, మోటార్‌సైకిళ్ల అభివృద్ధి.. టెస్టింగ్ ఖర్చులను బీఎండబ్ల్యూ భరిస్తుంది.